Share News

మధురవాడలో మహాభివృద్ధి!

ABN , Publish Date - May 13 , 2026 | 01:06 AM

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో మౌలిక వసతులను మెరుగుపరచడంపై జీవీఎంసీ దృష్టిసారించింది.

మధురవాడలో మహాభివృద్ధి!

రూ.648.21 కోట్లతో యూజీడీ ప్రాజెక్టు

21,800 ఇళ్లకు యూజీడీ కనెక్షన్‌

కాపులుప్పాడ వద్ద ఎస్‌టీపీ ప్లాంటు నిర్మాణం

రూ.725 కోట్లతో నిరంతర తాగునీటి సదుపాయం

నరవ నుంచి కొత్తగా పైప్‌లైన్‌ ఏర్పాటు

ముడసర్లోవ వద్ద 65 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో మౌలిక వసతులను మెరుగుపరచడంపై జీవీఎంసీ దృష్టిసారించింది. రూ.648.21 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్టుతోపాటు రూ.725 కోట్లతో నిరంతర నీటి సరఫరా ప్రాజెక్టును కేటాయించింది. యూజీడీ ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తికాగా, నిరంతర నీటిసరఫరా ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్‌ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే మధురవాడ మరింతవేగంగా అభివృద్ధిచెందడంతో పాటు రూపురేఖలు మారిపోతాయని అధికారులు చెబుతున్నారు.

ఒకప్పుడు నగరానికి శివారు ప్రాంతంగా భావించే మధురవాడ, ఆరిలోవ ప్రాంతాలు ఇప్పుడు ఐటీ కంపెనీలు, డేటాసెంటర్‌, హెల్త్‌సిటీల రాకతో ఊహించని విధంగా అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, యూజీడీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై జీవీఎంసీ దృష్టిసారించింది. ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

భారీ యూజీడీ ప్రాజెక్టు

మధురవాడ ప్రాంతంలో యూజీడీ సదుపాయం లేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది వార్డుల్లో యూజీడీ సదుపాయం కల్పించేందుకు రూ.648.21 కోట్లు అవసరయని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనాలు తయారుచేశారు. అంతమొత్తాన్ని జీవీఎంసీ వెచ్చించే పరిస్థితి లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రపంచబ్యాంక్‌కు అనుబంధంగా పనిచేసే ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) ద్వారా రుణం తీసుకోవాలని నిర్ణయించారు. మరికొంత మొత్తాన్ని సర్దుబాటుచేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మధురవాడ ప్రాంతంలోని 21,800 ఇళ్లకు యూజీడీ అందుబాటులోకి వస్తుంది. 450 కిలోమీటర్ల పొడవున పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌తోపాటు రెండు చోట్ల పంప్‌హౌస్‌లు నిర్మించి, కాపులుప్పాడలో 20 ఎంఎల్‌డీ సామర్థం కలిగిన ఎస్‌టీపీ (ిసీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌)ను కాపులుప్పాడవద్ద నిర్మించేలా డిజైన్‌ తయారుచేశారు. శుద్ధిచేసిన నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో పాటు ఆస్తిపన్ను, యూజీడీ యూజర్‌ చార్జీల ద్వారా ఐఎఫ్‌సీ రుణం తీర్చాలని నిర్ణయించారు. దీంతో రెండు నెలల కిందటే అధికారులు టెండర్‌ పిలవడంతో అయ్యప్పకన్‌స్ట్రక్షన్స్‌ పనులను దక్కించుకుంది. రెండేళ్లలో పూర్తిచేయాలని అధికారులు లక్ష్యం విధించారు. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం (రూ.164కోట్లు) అర్బన్‌ ఛాలెంజ్‌ఫండ్‌ ద్వారా సర్దుబాటు చేసేందుకు మంగళవారం కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో జీవీఎంసీపై ఆర్థికభారం తగ్గింది.

నిరంతర తాగునీటి ప్రాజెక్టు

మధురవాడ ప్రాంతానికి ప్రస్తుతం కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (కేబీఆర్‌) నుంచి పైప్‌లైన్‌ ద్వారా ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి మధురవాడ, ఆరిలోవ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జనాభా పెరిగిపోతుండడంతో తాగునీటికి డిమాండ్‌ పెరిగి సరఫరాపై ప్రభావం పడుతోంది. గూగుల్‌డేటా సెంటర్‌, ఐటీ కంపెనీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటికి మరింత డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో కేవలం మధురవాడ, ఆరిలోవ ప్రాంతాలకు (వార్డు నంబరు ఐదు నుంచి 13 వరకు) ప్రతీ రోజూ 64 ఎంఎల్‌డీ నీటిని నిరంతరం (24+7) సరఫరా చేసేలా రూ.725 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ మొత్తంలో ముడసర్లోవ వద్ద ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ నిర్మించి, నరవ నుంచి నీటిని పైప్‌లైన్‌ ద్వారా తీసుకొచ్చి శుద్ధిచేయనున్నారు. ఈ నీటిని పైప్‌లైన్‌ ద్వారా ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేసి అక్కడి నుంచి దాదాపు 25 వేల ఇళ్లకు నిరంతరం సరఫరా చేసేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఇందుకు అయ్యే వ్యయంలో 25 శాతం (రూ.181కోట్లు)ని యూసీఎఫ్‌ కింద కేంద్ర ప్రభుత్వం జీవీఎంసీకి సర్దుబాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. మిగిలిన మొత్తాన్ని ఐఎఫ్‌సీ నుంచి రుణంగా సమకూర్చుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టును కూడా 2028 నాటికి పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తూ మధురవాడ, ఆరిలోవ పరిసరప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ఆ ప్రాంతరూపురేఖలు మారిపోతాయని భావిస్తున్నారు.


జీవీఎంసీకి మూడు భారీ ప్రాజెక్టులు

మొత్తం విలువ రూ.1,490.21 కోట్లు

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీలో . రూ.1,490.21 కోట్ల విలువైన మూడు భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) కింద కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు సమకూర్చనుందని, మిగిలిన మొత్తం ఇంటర్నేషన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) రుణం ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారులతో కూడిన నేషనల్‌ అపెక్స్‌ కమిటీ మంగళవారం సమావేశమై జీవీఎంసీకి మూడు ప్రాజెక్టులను కేటాయించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. భారీమొత్తంతో కూడిన ప్రాజెక్టులను సాధించిన స్థానిక సంస్థ జీవీఎంసీయే కావడం గర్వకారణమన్నారు. మధురవాడ ప్రాంతంలోని ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది వార్డుల పరిఽధిలో రూ.648.21 కోట్లతో యూజీడీ ప్రాజెక్టుకు ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తిచేశామన్నారు. రూ.725 కోట్లతో ఐదు నుంచి 13 వార్డుల వరకు ఉన్నప్రాంతాలకు నిరంతర తాగునీటిసరఫరా కోసం మరో ప్రాజెక్టు ఆమోదం పొందిందన్నారు. నగర పరిధిలోని బల్క్‌, సెమీబల్క్‌ కనెక్షన్‌లకు రీడింగ్‌ తీసేందుకు రూ.117 కోట్లతో స్కాడా యంత్రాల ఏర్పాటు, మోటారు మార్పిడికి మరో ప్రాజెక్టు ఆమోదం పొందడంతో త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 2028 నాటికి మూడు ప్రాజెక్టులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కమిషనర్‌ వివరించారు.

Updated Date - May 13 , 2026 | 01:06 AM