మహా నిర్లిప్తత!
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:49 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని పలు విభాగాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ పాలకుల నిర్ణయాలపై అభ్యంతరాలు
ఇన్‌చార్జి ఏడీసీగా యూసీడీ పీడీ నియామకం వివాదాస్పదం
కోడి వ్యర్థాల సేకరణ కాంట్రాక్టర్ల నుంచి నేతలు మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు
చెత్త తరలింపులో అక్రమాలకు పాల్పడిన ‘రాసా’కు మరోసారి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ అప్పగించిన జీవీఎంసీ అధికారులు
అయినా నోరు మెదపని కమిషనర్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని పలు విభాగాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు యూసీడీ పీడీగా ఉన్న సత్యవేణికి నిబంధనలకు విరుద్ధంగా అదనపు కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారంటూ కొందరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కోడి వ్యర్థాలను చేపల చెరువులకు తరలించుకునేందుకు సదరు కాంట్రాక్టర్ల నుంచి పాలక వర్గంలోని ముగ్గురు నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత కలిసి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా కమిషనర్ కేతన్‌గార్గ్ స్పందించకపోవడం జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది.
సుమారు 25 లక్షల జనాభా, రూ.నాలుగు వేల కోట్లకుపైగా వార్షిక బడ్జెట్‌తో రాష్ట్రంలో అతిపెద్ద స్థానిక సంస్థగా జీవీఎంసీకి గుర్తింపు ఉంది. జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేయడం ఒక గొప్పఅవకాశంగా ఐఏఎస్ అధికారులు భావిస్తారు. పాలకవర్గంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయాలని కోరితే సున్నితంగా తిరస్కరించడంతోపాటు వారి ఒత్తిళ్లకు కిందిస్థాయి అధికారులు తలొగ్గకుండా చూడాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉంటుంది. అయితే కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలు జీవీఎంసీ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా ఉంటున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పదవీకాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండడంతో పాలకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు నేతలు చెలరేగిపోతున్నారంటున్నారు. నగరంలోని కోడి వ్యర్థాలను కాంట్రాక్టర్లు చేపల చెరువులకు తరలించేస్తున్నారు. కేతన్‌గార్గ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఆ వాహనాలు కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు వెళ్లేలా చూసే బాధ్యతను వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. అంతేగాకుండా కాపులుప్పాడలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. దీంతో చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాల తరలింపు ఆగింది. అయితే పాలకవర్గంలోని ముగ్గురు నేతలు, ప్రతిపక్ష నేత ఒకరు కలిసి కోళ్ల వ్యర్థాల కాంట్రాక్టర్ల నుంచి నెలకు రూ.ఎనిమిది లక్షలు చొప్పున మామూళ్లు తీసుకుంటూ, వాటిని చేపల చెరువులకు తరలించినా అభ్యంతరం చెప్పొద్దంటూ అధికారులపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీనిపై కిందిస్థాయి అధికారులు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోలేదని జీవీఎంసీలో ప్రచారం జరుగుతోంది. అధికారులు సైతం ఆ ముగ్గురు నేతల ఆదేశాలకు తలొగ్గడంతో కోళ్ల వ్యర్థాలు చేపల చెరువులకు వెళ్లిపోతున్నాయి. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినా, కొందరు కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకున్న దాఖలాలు లేవు.
జీవీఎంసీలో యూసీడీ పీడీగా పనిచేస్తున్న స్పెషల్‌గ్రేడ్ మునిసిపల్ కమిషనర్ సత్యవేణికి ఇటీవల అదనపు కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాలు జారీచేశారు. ఎవరికైనా అదనపు కమిషనర్ బాధ్యతలు అప్పగించాలంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంటుందని, అయినా ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉన్న అధికారికి, తన క్యాడర్ కంటే పెద్ద పోస్టు అప్పగించడం సరికాదంటూ కొందరు రాష్ట్ర ప్రభుత్వానికి, సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. అయినా కమిషనర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. తర్వాత పూర్తిస్థాయి అదనపు కమిషనర్‌గా పి.నల్లనయ్య నియమితులయ్యారు. అప్పుడైనా సత్యవేణిని ఏడీసీ అదనపు బాధ్యతల తప్పించి తిరిగి యూసీడీ పీడీగా పంపిస్తారని అంతా భావించారు. కానీ కమిషనర్ మాత్రం ఆమెకు కీలకమైన జనరల్ అడ్మినిస్ర్టేషన్‌తోపాటు అనేక ముఖ్య విభాగాల బాధ్యతలు అప్పగించి, కొత్తగా వచ్చిన నల్లనయ్యకు ప్రజారోగ్యం, అప్పటికే ఏడీసీలుగా ఉన్న ఎస్‌ఎస్ వర్మకు రెవెన్యూ, రమణమూర్తికి ప్రాజెక్టులు, పీజీఆర్‌ఎస్, ఆర్‌టీఐ వంటి విభాగాలను అప్పగిస్తూ అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు.
జీవీఎంసీ పరిధిలో ఇళ్ల నుంచి క్లాప్ వాహనాల ద్వారా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించేందుకు వీలుగా ప్రతి జోన్‌లో గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లను, అక్కడ నుంచి కంటెయినర్ మాదిరిగా ఉండే వాహనాల్లో లోడ్ చేసి కాపులుప్పాడ తరలించడం ద్వారా పర్యావరణ కాలుష్యం లేకుండా చేసేందుకు క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ఏర్పాటుచేశారు. మూడు జీటీఎస్‌ల నిర్వహణను రాసా సంస్థ దక్కించుకోగా, మరొకటి వేరొక సంస్థ దక్కించుకుంది. ఒక్కో సీసీఎస్ ప్రాజెక్టు నిర్వహణకు ఏటా సగటున రూ.రెండు కోట్లు వరకు జీవీఎంసీ వెచ్చిస్తోంది. అయితే రాసా సంస్థ చెత్త తరలింపు ప్రక్రియను సరిగా చేయకపోవడంతో జీటీఎస్‌ల వద్ద గుట్టలుగా పేరుకుపోయి, స్థానికంగా పారిశుధ్య సమస్య తలెత్తుతోంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో కమిషనర్ కేతన్‌గార్గ్ స్వయంగా కొన్నాళ్ల కిందట తనిఖీ చేసి కాంట్రాక్టు సంస్థ పనితీరు సరిగా లేదని గుర్తించి చర్యలకు ఆదేశించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి ఆ సంస్థ సుమారు రూ.81 లక్షలు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించి రికవరీ చేశారు. అలాంటి సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి భవిష్యత్తులో జీవీఎంసీలో పనిచేయకుండా చేయాల్సిన అధికారులు...అదే సంస్థకు తిరిగి రెండు సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. తప్పుచేసినట్టు నిర్ధారణ అయినా సంస్థకు తిరిగి టెండర్లు అప్పగించిన అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కమిషనర్ జీవీఎంసీలో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది.