Share News

మహా సంబరం

ABN , Publish Date - May 28 , 2026 | 01:20 AM

‘మహానాడు’ బుధవారం జిల్లాలోని 82 క్లస్టర్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అధిష్ఠానం సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పన్నెండు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు.

మహా సంబరం

జిల్లావ్యాప్తంగా 82 క్లస్టర్స్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణ

పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు

భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరు

కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన

ప్రధాన కార్యక్రమం వీక్షించేందుకు ఎక్కడికక్కడ స్ర్కీన్లు ఏర్పాటు

క్యాడర్‌లో ఉత్సాహం నింపిన నేతల ప్రసంగాలు

విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘మహానాడు’ బుధవారం జిల్లాలోని 82 క్లస్టర్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అధిష్ఠానం సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పన్నెండు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని బిగ్‌ స్ర్కీన్‌లపై ప్రత్యక్షంగా వీక్షించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేష్‌, ఇతర ముఖ్య నాయకుల ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, చేసిన పోరాటాల గురించి మాట్లాడినప్పుడు ‘జై చంద్రబాబునాయుడు’, ‘జై లోకేష్‌’, ‘జై తెలుగుదేశం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఎంపీ ఎం.శ్రీభరత్‌ భీమిలి, నార్త్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని పలు క్లస్టర్స్‌లో నిర్వహించిన మహానాడులో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ప్రసంగాలను వీక్షించారు. గోపాలపట్నంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్త ఒక నాయకుడేనని, పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించిన మహానాడులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. ఆయాచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించి, ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్‌, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి మల్లిక్‌ నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌, లొడగల కృష్ణ, మల్లిక్‌ నాయుడు మాట్లాడుతూ ఏటా రాష్ట్రంలో ఒకచోట నిర్వహించే మహానాడుకు జిల్లా నుంచి 200 మంది వెళితే, ఇప్పుడు ఒక్కో క్లస్టర్‌లో నిర్వహిస్తున్న మహానాడులో 200 నుంచి 300 మంది కార్యకర్తలు పాల్గొంటున్నారన్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తొలిరోజు మహానాడు నిర్వహించారు. మధ్యాహ్నం కార్యకర్తలకు వేదికల వద్దే భోజన ఏర్పాట్లు చేశారు.

Updated Date - May 28 , 2026 | 01:20 AM