మహా సంగ్రామం
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:02 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
జీవీఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
నేటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో డ్రోన్‌లతో నిఘా
కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ
మేయర్ అభ్యర్థులుగా కూటమి నుంచి ముక్కా శ్రావణి, వైసీపీ నుంచి వరుదు కల్యాణి
విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 120 వార్డుల పరిధిలోని 1,990 కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితోపాటు సామగ్రిని కూడా శనివారమే తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పరిశీలించారు.
జీవీఎంసీ మేయర్ పదవికి కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) నుంచి ముక్కా శ్రావణి, వైసీపీ నుంచి వరుదు కళ్యాణితోపాటు మరో 13 మంది పోటీలో ఉన్నారు. అలాగే 120 వార్డుల నుంచి 573 మంది కార్పొరేటర్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఎన్నికలకు అక్టోబరు 14న నోటిఫికేషన్ విడుదల కాగా 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన చేపట్టారు. 21వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 28న పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, న్యాయపరమైన వివాదం తలెత్తడంతో నవంబరు ఒకటో తేదీకి వాయిదావేసిన విషయం తెలిసిందే. జీవీఎంసీ పరిధిలో 18,37,901 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి జోన్‌లోని ఐదు వార్డుల్లో గల 78 పోలింగ్ కేంద్రాల పరిధిలో 66,446 మంది, మధురవాడ జోన్‌లోని ఏడు వార్డుల్లో గల 162 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,49,452 మంది, తూర్పు జోన్‌లోని 18 వార్డులకు సంబంధించి 309 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,96,124 మంది, దక్షిణ జోన్‌లోని 16 వార్డులకు సంబంధించిన 249 పోలింగ్ కేంద్రాల్లో 2,17,817 మంది, ఉత్తర జోన్‌లోని 20 వార్డులకు సంబంధించి 302 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,91,691 మంది, పశ్చిమ జోన్‌లోని 17 వార్డులకు సంబంధించిన 245 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,22,029 మంది, గాజువాక జోన్‌లోని 19 వార్డులకు సంబంధించిన 329 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,98,229 మంది, అగనంపూడి జోన్‌లోని ఐదు వార్డులకు సంబంధించిన 75 పోలింగ్ కేంద్రాల పరిధిలో 69,796 మంది, అనకాపల్లి జోన్‌లోని ఆరు వార్డులకు సంబంధించిన 89 పోలింగ్ కేంద్రాల పరిధిలో 76,950 మంది, పెందుర్తి జోన్‌లోని ఏడు వార్డుల్లో గల 152 పోలింగ్‌కేంద్రాల పరిధిలో 1,49,367 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 4,378 బ్యాలెట్ బాక్స్‌లు వినియోగిస్తున్నారు. 14,334 మంది సిబ్బందిని నియమించారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 4,500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. అల్లర్లు, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి వాటికి ఆస్కారం లేకుండా 177 రూట్ మొబైల్స్, 50 స్ర్టైకింగ్ ఫోర్స్, 15 స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఓటర్లు మినహా పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఇతరులు ప్రవేశించడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టయితే ముందుగా గుర్తించడం, సకాలంలో బలగాలను అక్కడకు పంపించి గొడవలు జరగకుండా నియంత్రించేందుకు వీలుగా సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 20 డ్రోన్‌లతో నిఘా ఏర్పాటుచేశారు. దొమ్మీలు, కొట్లాటలు, దౌర్జన్యాలు, ప్రలోభాలు వంటివి జరిగితే సాక్ష్యాలు సేకరించేందుకు వీలుగా వీడియోగ్రఫీ బృందాలు, సీసీటీవీలు, బాడీవార్న్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్టు సీపీ ప్రకటించారు. నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని వివరించారు. పోలింగ్ సందర్భంగా ఇబ్బందులు సృష్టించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొత్తంవార్డులు 120
పోలింగ్ కేంద్రాలు 1,990
మొత్తం ఓటర్లు 18,37,901
బ్యాలెట్ బాక్స్‌లు 4,378
పోలింగ్ సిబ్బంది 14,334
బందోబస్తు సిబ్బంది 4,500
-----------------------------
జోన్ వార్డులు పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు
1. భీమిలి 5 78 66,446
2. మధురవాడ 7 162 1,49,452
3. తూర్పు జోన్ 18 309 2,96,124
4. దక్షిణ జోన్ 16 249 2,17,817
5. ఉత్తర జోన్ 20 302 2,91,691
6. పశ్చిమ జోన్ 17 245 2,22,029
7. గాజువాక జోన్ 19 329 2,98,229
8. అగనంపూడి జోన్ 5 75 69,796
9. అనకాపల్లి జోన్ 6 89 76,950
10. పెందుర్తి 7 152 1,49,367