Share News

అభివృద్ధి పనులకు కంకర కొరత

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:53 AM

జిల్లాలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కంకర కొరత ఏర్పడింది. ప్రస్తుతం రహదారులు, డ్రైనేజీ కాలువలు, భవనాలు, పరిశ్రమల నిర్మాణ పనులు జోరుగా సాగుతుండడంతో పెద్ద మొత్తంలో కంకర అవరమైంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వున్న క్వారీలు/ క్రషర్లలో ఉత్పత్తి చేసే కంకరకన్నా డిమాండ్‌ అధికంగా వుండడంతో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులకు పూర్తిస్థాయిలో మెటల్‌ అందుబాటులో వుండడంలేదని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధి పనులకు కంకర కొరత
చోడవరంలో సీసీ రోడ్డు నిర్మాణం

జిల్లాలో జోరుగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం

కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటు

ఒకేసారి పెద్ద మొత్తంలో కంకర వినియోగం

డిమాండ్‌ స్థాయిలో సరఫరా చేయలేకపోతున్న క్వారీలు, స్టోన్‌ క్రషర్లు

పలుచోట్ల మందగించిన పనులు

చోడవరం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కంకర కొరత ఏర్పడింది. ప్రస్తుతం రహదారులు, డ్రైనేజీ కాలువలు, భవనాలు, పరిశ్రమల నిర్మాణ పనులు జోరుగా సాగుతుండడంతో పెద్ద మొత్తంలో కంకర అవరమైంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వున్న క్వారీలు/ క్రషర్లలో ఉత్పత్తి చేసే కంకరకన్నా డిమాండ్‌ అధికంగా వుండడంతో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులకు పూర్తిస్థాయిలో మెటల్‌ అందుబాటులో వుండడంలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుండడంతో ఇప్పటికే నిధులు మంజూరైన పనులను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీతోపాటు జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి జోన్‌లో కూడా రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణం, మరమ్మతు పనులు జరుగుతున్నాయి. మరోవైపు పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు సైతం ఊపందుకున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి అత్యధిక పనులను మార్చిలోగా పూర్తి చేయాల్సి వుంది. ఇక ప్రైవేటు రంగంలో జిల్లాలోని ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో పరిశ్రమల నిర్మాణ పనులు, రాంబిల్లి మండలంలో ఎన్‌ఏవోబీ పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, తారురోడ్లకు 6 ఎం.ఎం. నుంచి, 20 ఎం.ఎం. వరకు వివిధ రకాల మెటల్‌ను వినియోగిస్తారు. భవనాల శ్లాబ్‌లకు బేబీ చిప్స్‌ వాడతారు. దీంతో అన్ని పనులకు వివిధ సైజుల కంకర, చిప్స్‌, క్రషర్‌ బూడిద పెద్ద మొత్తంలో వినియోగించాల్సి వస్తున్నది. కానీ జిల్లాలోని రాయి క్వారీలు, స్టోన్‌ క్రషర్ల నుంచి డిమాండ్‌ మేరకు ఉత్పత్తి జరగడంలేదు. జరుగుతున్న పనుల అవసరాల మేరకు కంకర సరఫరా కావడంలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా 6 ఎం.ఎం., 10 ఎం.ఎం., 20 ఎం.ఎం. మెటల్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. అవసరం మేరకు మెటీరియల్‌ అందకపోవడంతో పనులు త్వరగా పూర్తిచేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:53 AM