గ్రావెల్ దోపిడీ!
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:37 AM
పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు గ్రావెల్ అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, అనకాపల్లి ప్రాంతాల్లో ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్, రాళ్లను అనుమతి లేకుండా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొందరు స్థానిక నేతల సహకారం వెరసి అక్రమార్కులకు వరంగా మారుతున్నది.
ఏపీఐఐసీ భూముల్లో రోడ్డు నిర్మాణం
అదనంగా వచ్చిన గ్రావెల్, రాళ్లను అమ్ముకుంటున్న అక్రమార్కులు
పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు గ్రావెల్ అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, అనకాపల్లి ప్రాంతాల్లో ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్, రాళ్లను అనుమతి లేకుండా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొందరు స్థానిక నేతల సహకారం వెరసి అక్రమార్కులకు వరంగా మారుతున్నది.
అనకాపల్లి మండలం కోడూరులో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు వుంది. భూముల అభివృద్ధి మాటు గ్రావెల్ తవ్వుకుని అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే బండరాళ్లను వదలడంలేదు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వీటిని తరలించుకుపోతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కోడూరు ఎంఎస్‌ఎంఈ పార్కులో సుమారు 70 ఎకరాలను వివిధ సైజుల్లో ప్లాట్లుగా విభజించారు. అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశారు. సుమారు 250 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్‌లను కేటాయించారు. ఇదిలావుండగా సబ్బవరం-అనకాపల్లి జాతీయ రహదారిని అనుసంధానం చేసేందుకు కోడూరు నుంచి సబ్బవరం మండలం అసకపల్లి వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ పనులు వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనుల క్రమంలో వచ్చే గ్రావెల్, రాళ్లను ఇతరచోట్ల వినియోగించాలి. లేకపోతే ఏపీఐఐసీకి సంబంధించిన స్థలాల్లో వాడుకోవాలి. ఒకవేళ ఇతర అవసరాలకు మళ్లించాలంటే గనులు, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్ అండదండలతో కొందరు అక్రమార్కులు గ్రావెల్, రాళ్లను ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ గ్రావెల్ రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అమ్ముకొంటున్నారు. వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీఐఐసీ అధికారులను వివరణ కోరగా... రోడ్డు నిర్మాణ పనులతో తమకు సంబంధం లేదని, వీఎంఆర్‌డీఏ పర్యవేణలో జరగుతున్నాయని చెబుతున్నారు. వీఎంఆర్‌డీఏ ఇంజనీర్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించడం లేదు.