ఎంకేపట్నంలో గ్రావెల్ దందా
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:01 AM
మండలంలోని ఎంకేపట్నం రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుపూతూ ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారు. కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు.
నదిని ఆనుకొని పోరంబోకు భూమిలో తవ్వకాలు
నాలుగు రోజుల నుంచి ట్రాక్టర్లతో రవాణా
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు
రోలుగుంట, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎంకేపట్నం రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుంచి యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుపూతూ ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారు. కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు.
మంలంలోని ఎంకేపట్నం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 121-3లో వరహా నదికి ఆనుకొని గెడ్డ పోరంబోకు భూమి వుంది. సుమారు 2.3 ఎకరాలు వున్న ఇది రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైవుంది. ఇక్కడ ఇసుక పొరలతో కూడిన నాణ్యమైన గ్రావెల్ వుండడంతో అక్రమార్కుల కన్ను పడింది. ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేసుకొని నాలుగు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రావెల్ తవ్వుతున్నారు. నదిని ఆనుకుని ఉన్న కొండను కూడా తవ్వేస్తున్నారు. సుమారు ఇరవై అడుగుల ఎత్తు మేర గ్రావెల్‌ను తవ్వి, ట్రాక్టర్ల ద్వారా బీబీపట్నం, గైరంపేట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఇళ్ల స్థలాలను ఎత్తు చేయడం, పునాదులు నింపడం, రియల్ ఎస్టేట్ వెంచర్ల రోడ్ల నిర్మాణం వంటి అవసరాలకు గ్రావెల్ సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. పట్టపగలు గ్రావెల్ తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినాచూడడం లేదు. ఎంకేపట్నం రెవెన్యూ పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై వీఆర్వో రాజులమ్మను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. గ్రావెల్ తవ్వకాలకు రెవెన్యూ శాఖ అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ రోజే తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపరిచానని ఆయన చెప్పారు.