గ్రావెల్ మాఫియా
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:42 AM
జిల్లాలో గ్రావెల్, మట్టి, రాయి అక్రమ తవ్వకాల ముఠాలు చెలరేగిపోతున్నాయి.
జిల్లాలో పెద్దఎత్తున అక్రమాలు
అనుమతులు లేకుండా తవ్వకాలు
మామూళ్ల మత్తులో మైన్స్, పోలీస్, రెవెన్యూ అధికారులు
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గ్రావెల్, మట్టి, రాయి అక్రమ తవ్వకాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. క్వారీయింగ్‌కు ఒకచోట తాత్కాలిక పర్మిట్ తీసుకుని మరోచోట తవ్వకాలు సాగిస్తున్నాయి. గనులు, పోలీస్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేస్తే అనుమతి పొందిన క్వారీకి సంబంధించిన పర్మిట్ కాపీలు చూపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.
నగర శివారు ప్రాంతాల్లో కేవలం ఐదారు క్వారీలకు మాత్రమే గనుల శాఖ అనుమతులు ఉన్నాయి. కానీ జిల్లాలో చాలాచోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. అడవివరం శివారు దువ్విపాలెం వద్ద గతంలో క్వారీయింగ్‌కు ఒకరికి అనుమతి లభించింది. అయితే కొండ నుంచి రాళ్లు జారిపడడంతో తవ్వకాలు నిలిపివేశారు. అయితే విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సిఫారసుతో మళ్లీ అనుమతులు ఇచ్చారు. ఇదే కొండకు ఆవలి వైపు మరొకరు రాయి తవ్వి తరలించేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అనుమతి పొందిన క్వారీ నుంచి తెస్తున్నామని చెబుతున్నారు. వైసీపీకి చెందిన ఈ వ్యక్తికి కొందరు కూటమి నేతలు దన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పెందుర్తి మండలం గుర్రంపాలెంలో ఏపీఐఐసీకి చెందిన లేఅవుట్‌కు ఆనుకుని రెవెన్యూ శాఖ పరిఽధిలోని 87 ఎకరాల కొండను గ్రామానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి తవ్వేస్తున్నారు. ఈ ముఠా కూడా ఇదే మండలంలో మరోచోట ప్రభుత్వ అనుమతి ఉన్న క్వారీ వేబిల్లులు, పర్మిట్లు చూపిస్తున్నారు. ఈ ముఠా అక్రమాలపై గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మైనింగ్ సీనరేజీ వసూలు చేసుకునే సంస్థ ప్రతినిధులకు కూడా గుర్రంపాలెం ముఠా తప్పుడు బిల్లులు చూపిస్తున్నారు. ఇక ఆనందపురం, పద్మనాభం, గాజువాక ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈ ముఠాల నుంచి పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రతి నెలా భారీగా లంచాలు ముడుతున్నాయని సమాచారం.
క్వారీ నిర్వహించాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం, రెవెన్యూ ఎన్‌వోసీ తీసుకుని గనుల శాఖకు దరఖాస్తు చేయాలి. ఆ శాఖ సూచన మేరకు కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తరువాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆ తరువాత మైనింగ్ శాఖ పర్మిట్లు ఇస్తుంది. అటువంటిదేమీ లేకుండా గతంలో అనుమతి పొందిన క్వారీల నుంచి వేబిల్లులు, పర్మిట్లు తీసుకుని అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.