Share News

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డేలేదు

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:55 AM

మండలంలోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు అర్థరాత్రి వేళ ఎక్స్‌కవేటర్లతో అక్రమ తవ్వకాలు మొదలు పెట్టి తెల్లవారే వరకు గ్రావెల్‌, మట్టిని లారీల్లో తరలించేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు అడ్డేలేదు
పైడివాడఅగ్రహారంలో ఎన్టీఆర్‌ కాలనీ లేఅవుట్‌ను ఆనుకొని జరుగుతున్న అక్రమ తవ్వకాలు

- రాత్రి వేళ యథేచ్ఛగా తవ్వి తరలింపు

- లేఅవుట్లలో ఇళ్ల బేస్‌మెంట్లను ధ్వంసం చేసి మరీ మట్టి తవ్వకాలు

- పట్టించుకోని అధికారులు

సబ్బవరం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు అర్థరాత్రి వేళ ఎక్స్‌కవేటర్లతో అక్రమ తవ్వకాలు మొదలు పెట్టి తెల్లవారే వరకు గ్రావెల్‌, మట్టిని లారీల్లో తరలించేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

మండలంలోని పైడివాడఅగ్రహారం గ్రామంలో ఎన్టీఆర్‌ కాలనీ(గతంలో జగనన్న కాలనీ)లో గత కొన్ని రోజులుగా కాలనీని ఆనుకొని అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. లేఅవుట్‌లో ఉన్న బేస్‌మెంట్లను సైతం ధ్వంసం చేసి గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. అసకపల్లి, రాయపుర అగ్రహారం, వంగలి తదితర గ్రామాల్లో మట్టి, గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. నంగినారపాడులో ఇళ్ల బేస్‌మెంట్ల మధ్యలో తవ్వకాలు జరిపి మట్టిని తరలించుకుపోతున్నారు. పైడివాడ, గంగవరం, నంగినారపాడు, గాలిభీమవరం గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా లారీ గ్రావెల్‌ రూ.4 వేలు, డంపర్‌ గ్రావెల్‌ రూ.7 వేలు చొప్పున విక్రయిస్తున్నారని తెలిసింది. మైనింగ్‌, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 08 , 2026 | 12:55 AM