దిక్కుతోచని స్థితిలో గోవాడ కార్మికులు
ABN , Publish Date - May 01 , 2026 | 02:22 AM
సైరన్ మోతలు.. సీజన్, ఆన్ సీజన్ అనే తేడా లేకుండా విధి నిర్వహణలో తలమునకలై పనిచేసే కార్మికుల హడావిడితో సందడిగా ఉండే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బోసిపోయింది.
షుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో రోడ్డునపడిన కుటుంబాలు
కార్మికులకు రూ.5 కోట్ల వరకు బకాయిలు
ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వలస
వీఆర్‌ఎస్ ప్రకటించి ఆదుకోవాలని వినతి
చోడవరం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
సైరన్ మోతలు.. సీజన్, ఆన్ సీజన్ అనే తేడా లేకుండా విధి నిర్వహణలో తలమునకలై పనిచేసే కార్మికుల హడావిడితో సందడిగా ఉండే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బోసిపోయింది. వివిధ కారణాల వల్ల ఏడాది నుంచి మూతపడడంతో, ఇన్నేళ్ల నుంచి ఫ్యాక్టరీపై ఆధారపడిన కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరు దశాబ్దాలపాటు నడిచిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ... ఇక తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం 45 సంవత్సరాల లోపు వయసున్న కార్మికులు అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీల్లో శ్రామిక పనులకు వెళుతుంటే, మరికొందరు ఇతర ప్రాంతాలకు వలసపోయారు. 50 సంవత్సరాలు దాటిన వారికి ఓపిక లేకపోవడం, ప్రైవేటు కంపెనీల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వున్నారు. మరికొద్ది నెలల్లో అయినా ఫ్యాక్టరీ తెరుచుకోకపోతుందా అన్న ఆశతో కాలం వెళ్లదీస్తున్నారు. షుగర్స్ మూతపడే సమయానికి ఫ్యాక్టరీలో ఎన్‌ఎంఆర్, డైలీవేజ్, ఓచర్‌పేమెంట్, పర్మినెంట్, సెక్యూరిటీ, తదితర విభాగాల్లో సుమారు వెయ్యి మంది వరకు కార్మికులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులతోపాటు, సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే విధుల్లోకి వస్తున్నారు.
ఇక పదవీ విరమణ చేసిన కార్మికులకు ఇప్పటికీ గ్రాట్యుటీ బకాయిలు చేతికి అందక విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న కొద్దిపాటి కార్మికులు సైతం నాలుగు నెలలుగా వేతనాలు అందక అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. రిటైరయిన కార్మికులతోపాటు, మిగిలిన కార్మికులకు సుమారుగా రూ.5 కోట్ల వరకూ అందాల్సి ఉంది. ఇవి ఎప్పటికి అందుతాయనేది దైవాదీనంగా మారింది.
వీఆర్‌ఎస్ పైనా అయోమయమే
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ ఒక పక్క స్థానిక ఎమ్మెల్యేలు భరోసా ఇస్తుండగా.. మరోవంక ఫ్యాక్టరీ తెరిచే పరిస్థితి కనిపించకపోవడంతో కనీసం వీఆర్‌ఎస్ అయినా అమలు చేసి తమకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేస్తే బాగుండేదన్న అభిప్రాయం చాలామంది కార్మికుల్లో వ్యక్తం అవుతున్నది. సొమ్ము చేతికి అందితే ఏదో ఒక ఉపాధి వెదుక్కోవడమో, లేదంటే చిన్నపాటి దుకాణం పెట్టుకుని జీవిస్తామని అంటున్నారు. అయితే కార్మికులకు వీఆర్‌ఎస్ అమలుపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కార్మికులకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్ల ఫ్యాక్టరీలో పనిచేసిన తమకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు.