24న గవర్నర్ రాక
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:06 AM
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 24వ తేదీన నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 24వ తేదీన నగరానికి రానున్నారు. ఆరోజు రాత్రి తొమ్మిదిగంటలకు నగరానికి చేరుకుని, నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు. ఆ మరుసటి రోజు 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ బయలుదేరి వెళతారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లకు 8,107 దరఖాస్తులు
గత ఏడాది కంటే 1,964 అధికం
25న లాటరీ ద్వారా సీట్లు కేటాయింపు
ధ్రువీకరణకు వచ్చే 7వ తేదీ వరకూ అవకాశం
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ గుర్తింపుపొందిన ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో ఉచిత సీట్ల కోసం 8,107 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 650 ప్రైవేటు పాఠశాలల్లో ఆరు వేలకుపైగా ఉచిత సీట్లు ఉన్నాయి. నిర్బంధ విద్య అమలు చట్టంలో భాగంగా ప్రతి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతిలో నాలుగో వంతు సీట్లు ఉచితంగా పేదల పిల్లలకు ఇవ్వాల్సి ఉంది. ఈ చట్టం 2023-24 విద్యా సంవత్సరం నుంచి అన్ని జిల్లాల్లో అమలుచేస్తున్నారు. గత ఏడాది ఉచిత సీట్లకు జిల్లాలో 6,143 దరఖాస్తులు అందగా, వచ్చే విద్యా సంవత్సరానికి 8,107 వచ్చాయి. గత ఏడాది కంటే 1,964 ఎక్కువ. గత ఏడాది 6,143 మందికి సీట్లు కేటాయించగా. వారిలో 3,419 మంది ఆయా పాఠశాలల్లో చేరగా మిగిలిన వారంతా పలు కారణాల వల్ల సీట్లు కోల్పోయారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం దరఖాస్తుదారులకు పూర్తిగా అవగాహన కల్పించారు. వచ్చిన దరఖాస్తుల మేరకు అమరావతిలో పాఠశాల విద్యా శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో ఈనెల 25వ తేదీన లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నారు. దీని ప్రకారం సీట్లు పొందిన బాల బాలికలు 26 నుంచి ఏప్రిల్ ఏడో తేదీలోగా ఆయా పాఠశాలల్లో ప్రవేశాలను ధ్రువీకరించాలి. ఆ తరువాత మిగిలిన సీట్లకు ఏప్రిల్ 12న రెండో విడత లాటరీ తీస్తారు. వీరికి ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీలోగా ప్రవేశాలు కల్పిస్తారు.
పంచాయతీల ఓటర్ల జాబితా తయారీలో జాప్యం
సాంకేతిక సమస్య కారణమంటున్న అధికారులు
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీ ఓటర్ల జాబితాల విడుదల ఆలస్యమవుతోంది. పంచాయతీల వారీగా కులాల వివరాలతో కూడిన ఓటర్ల జాబితాలను ఈనెల తొమ్మిదో తేదీన ఆయా కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు. అంటే మొన్న బుధవారం గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రదర్శించాలి. కానీ అటువంటిది ఎక్కడా జరగలేదు. సాంకేతిక కారణాలతోనే ఓటర్ల జాబితా విడుదల చేయలేదని పలువురు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల రెండో తేదీతో పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగుస్తోంది. ఆ తరువాత ప్రత్యేకాధికారులు నియమితులవుతారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకుగాను ఓటర్ల జాబితా తయారీకి గత నెలలోనే షెడ్యూల్ ఇచ్చారు. ఆ ప్రకారం ఈనెల తొమ్మిదో తేదీన ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామని పంచాయతీ అధికారులు గత నెలలోనే వెల్లడించారు. ఆ తరువాత 18వ తేదీ నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. చివరకు 20వ తేదీ వచ్చినా ఓటర్ల జాబితా విడుదల కాలేదు.
22 నుంచి ఇంటర్ మూల్యాంకనం
మద్దిలపాలెం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 22వ తేదీ నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆర్‌ఐవో బి.మురళీధర్ తెలిపారు. నగరంలోని పాత జైలు రోడ్డులో గల మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ చేపట్టనున్నారు. మొదట విడతలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తెలుగు, హిందీ, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, మేథమెటిక్స్, 25 నుంచి రెండో విడతలో మిగిలిన సబ్జెక్టుల సమాధానపత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. అధ్యాపకులు విధిగా మూల్యాంకనంలో పాల్గొనాలని, హాజరుకాని వారిపై బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
4 నుంచి టెన్త్ మూల్యాంకనం
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందుకోసం జ్ఞానాపురంలోని జూబ్లీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లుచేస్తున్నారు. సుమారు 800 మంది ఉపాధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.