Share News

రాజ్‌మాకు సర్కారు తోడ్పాటు

ABN , Publish Date - May 08 , 2026 | 12:35 AM

ఏజెన్సీలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న రాజ్‌మాకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.

రాజ్‌మాకు సర్కారు తోడ్పాటు
రాజ్‌మా పంట (ఫైల్‌)

ఆదివాసీ రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ

రెట్టింపైన దిగుబడులు

సాగు విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక

ఈ ఏడాది శతశాతం రాయితీపై మేలిరకం విత్తనాల పంపిణీకి చర్యలు

చింతపల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న రాజ్‌మాకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. 2025-26 వార్షిక సంవత్సరంలో గిరిజన రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలతో పాటు తొలిసారిగా విత్తనశుద్ధి, జీవన ఎరువులను పంపిణీ చేసింది. రైతులు మొక్కలు నాటి నుంచి పంట కోసే వరకు వివిధ దశల్లో వ్యవసాయ అధికారులు సాంకేతిక సహకారం అందించడం వల్ల దిగుబడులు రెట్టింపయ్యాయి. ఎకరానికి సాధారణ దిగుబడి కంటే 2.4 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది. వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ఎకరానికి గరిష్ఠంగా ఏడు క్వింటాళ్ల దిగుబడి సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రైతులకు శతశాతం రాయితీపై మేలిరకం విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

దక్షిణ భారత దేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే రాజ్‌మా పండుతుంది. ఆదివాసీ రైతులు 45 ఏళ్లగా రాజ్‌మా పంటను సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లులో రాజ్‌మాను సాగుచేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గత ప్రభుత్వం రాజ్‌మా పంటకు సరైన ప్రోత్సాహం అందించకపోవడం వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. 2024-25లో పాడేరు డివిజన్‌ పరిధిలో కేవలం పదివేల ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు చేపట్టారు. 2025-26 వార్షిక సంవత్సరంలో సాధార సాగు విస్తీర్ణం 20,600 ఎకరాలు కాగా, తొలిసారిగా గరిష్ఠంగా 45,875 ఎకరాల్లో రాజ్‌మా సాగు చేపట్టారు. చింతపల్లి పరిధిలోనే అత్యధికంగా 16,456 ఎకరాల్లో రైతులు రాజ్‌మా పంట పండించారు. దీంతో ఒకేసారి 94శాతం సాగు విస్తీర్ణం పెరిగింది.

వ్యవసాయ వినూత్న ప్రయత్నం

ఆదివాసీ రైతులు పండిస్తున్న రాజ్‌మా పంటకు పునరుజ్జీవం కల్పిస్తూ వ్యవసాయశాఖ వినూత్న ప్రయత్నం చేసింది. రైతులకు 90 శాతం రాయితీపై నాణ్యమైన చింతపల్లి రెడ్‌, చింతపల్లి వైట్‌ రకాల విత్తనాలను పంపిణీ చేసింది. అలాగే ప్రప్రథమంగా విత్తనశుద్ధి, జీవన ఎరువులను రాయితీపై అందజేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాలను రైతులు ట్రైకోడెమ్మవిరిడితో విత్తనశుద్ధి చేసుకుని నాట్లు వేసుకున్నారు. దీంతో విత్తనాల్లో మొలకెత్తేశాతం భారీగా పెరిగింది. అలాగే తెగుళ్లను నియంత్రించేందుకు 90 శాతం రాయితీపై వేప నూనె(నీమ్‌ ఆయిల్‌) అందజేశారు. రైతులు రాజ్‌మా పంటను పూర్తిగా ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు చేస్తూ తెగుళ్లను ఆశించకుండా వేపనూనెను పిచికారీ చేసుకున్నారు. ప్రధానంగా రాజ్‌మా పంటలో రైతులతో కలుపుతీత పనులను వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన జీవన నియంత్రణ ఎరువులు పంటలకు పెట్టుకోవడం వల్ల మొక్కలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ పూర్తి స్థాయిలో అందాయి. ఈ విధానాల వల్ల రాజ్‌మా పంటలో తెగుళ్లు, చీడపీడలు ఆశించకపోతే మొక్కలు ఏపుగా పెరిగాయి. నూర్పు సమయంలోనూ గింజలు పగిలిపోకుండా తీసుకోవాల్సిన జాత్రత్తలను రైతులకు వివరించారు.

రెట్టింపైన దిగుబడులు

వ్యవసాయశాఖ రాజ్‌మా నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు కచ్చితంగా రైతులతో చేయించడం వల్ల దిగుబడులు రెట్టింపయ్యాయి. కొన్నేళ్లగా ఆదివాసీ రైతులు రాజ్‌మా ఎకరానికి కేవలం 2.4 క్వింటాళ్ల దిగుబడికి మించి పొందడం లేదు. గత ఏడాది వ్యవసాయశాఖ చేపట్టిన వినూత్న ప్రయత్నం వల్ల ఈ ఏడాది రైతులు 4.8 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. జీకేవీధి, చింతపల్లి మండలాల్లో కొంత మంది రైతులు 5.3 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. గిరిజన రైతులు వ్యవసాయశాఖ సూచనలతో సాగు విధానంలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల ఊహించని విధంగా దిగుబడులు రెట్టింపు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఎకరానికి ఏడు క్వింటాళ్ల దిగుబడి సాధించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా చేసుకున్నది. అలాగే రైతులకు ఈ ఏడాది రాజ్‌మా ద్వారా అధిక ఆదాయం వచ్చింది. క్వింటా రాజ్‌మాను గరిష్ఠంగా రైతులు రూ.8,200 ధరకు విక్రయించారు. కిలోకి రూ.82 ధర లభించింది.

సాగు విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక

గిరిజన ప్రాంతంలో రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు వ్యవసాయశాఖ ఈ ఏడాది వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. 2024-25 వార్షిక సంవత్సరంలో రాజ్‌మా కేవలం పదివేల ఎకరాల్లో సాగు చేయగా, 2025-26లో వ్యవసాయశాఖ కృషి ఫలితంగా 45,875 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 60 వేల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రాజ్‌మా సాగును ప్రోత్సహించడం వల్ల రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - May 08 , 2026 | 12:35 AM