ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:42 AM
పరిపాలనతో పాటు పౌర సేవలు మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్‌పై యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రజలకు ఎంతో లబ్ధి
అవగాహన కల్పించేందుకు సచివాలయ సిబ్బందితో ఇంటింటా ప్రచారం
జిల్లాలో లక్షా 92 వేల 60 ఇళ్ల సందర్శన లక్ష్యం
ఇప్పటికి 86,281 ఇళ్లకు పూర్తయిన ప్రచారం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పరిపాలనతో పాటు పౌర సేవలు మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్‌పై యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ప్రధానంగా నిరక్ష్యరాస్యులు, ఇంటర్నెట్ సదుపాయం లేని గిరిజన ప్రాంతాల్లో తొలుత దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సచివాలయ సిబ్బంది ద్వారా చర్యలు చేపడుతోంది. వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆశయం, దానిని ఎలా వినియోగించాలనే అంశాలపై సిబ్బంది ఇంటింటిలా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికి 55 శాతం ప్రగతి సాధించగా, ఇంటింటా ప్రచారం కొనసాగుతున్నది.
ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని మొత్తం పదకొండు మండలాల్లో 212 గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న లక్షా 92 వేల 60 ఇళ్లను సందర్శించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటింటికీ సచివాలయ సిబ్బంది వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. తొలుత ప్రభుత్వ సేవలు పొందడానికి ‘మన మిత్ర 9552300009’ నంబర్‌ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై తర్ఫీదు ఇస్తున్నారు. తరువాత దాని ద్వారా ఎటువంటి సేవలు, ఎలా పొందాలనే అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ఏజెన్సీలో అధిక శాతం ప్రజలు నిరక్ష్యరాస్యులు కావడంతో పాటు అనేక ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడం ఇందుకు ప్రతిబంధకంగా మారుతున్నది. దీంతో ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా 86,281 ఇళ్లను మాత్రమే సందర్శించి వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించగలిగారు.
వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రయోజనాలెన్నో...
- ప్రభుత్వ సేవలు సులభతరమవుతాయి.
- ప్రతి పనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.
- పథకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం, వివరాలు వేగంగా పొందవచ్చు.
- ప్రజలకు సమయం, ఖర్చులు సైతం ఆదా అవుతాయి.
- సేవలు పారదర్శకంగా అందడంతో పాటు, వాటి స్థితిగతులను స్వయంగా తెలుసుకోవచ్చు.
- అత్యవసర పరిస్థితుల్లో ప్రకృతి విపత్తులు, ఆరోగ్య హెచ్చరికలు నేరుగా అందుతాయి.
- అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఇతర డిజిటల్ కాపీలను పొందవచ్చు.
జిల్లాలో వాట్సాప్ గవర్నెన్స్‌పై ఇంటింటా ప్రచారం వివరాలు
వ.సం మండలం సచివాలయాలు ప్రచారం చేసిన ఇళ్లు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల సంఖ్య
1. జి.మాడుగుల 18 4,883 12,647
2. పెదబయలు 16 5,915 10,830
3. పాడేరు 16 6,926 10,871
4. జీకేవీధి 18 7,596 11,414
5. అనంతగిరి 21 6,422 8,577
6. కొయ్యూరు 23 7,610 9,626
7. చింతపల్లి 22 10,754 12,394
8. అరకులోయ 18 8,263 8,737
9. హుకుంపేట 26 9,029 8,643
10. ముంచంగిపుట్టు 18 9,131 6291
11. డుంబ్రిగుడ 16 9,752 5,749
---------------------------------------------------------------------
మొత్తం 212 86,281 1,05,779
---------------------------------------------------------------------