అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:28 AM
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక మోదకొండమ్మ కల్యాణమండపంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
- కలెక్టర్ టి.నిషాంతి
- పేదల సేవలో గ్రామసభలు ప్రారంభం
హుకుంపేట, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక మోదకొండమ్మ కల్యాణమండపంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కచ్చితంగా చేరేలా చూడడంలో భాగంగానే ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ప్రారంభించిన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మప్రసాద్ మాట్లాడుతూ ప్రజల వద్దకే సంక్షేమ కార్యక్రమాలు చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల సేవలో కార్యక్రమాన్ని రూపొందించారని, ఫలితంగా పేద ప్రజలందరికీ పథకాలు అందుతాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ జి.జయకృష్ణ, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, ఎంపీడీవో తేజ్‌రతన్, డిప్యూటీ ఎంపీడీవో రమేశ్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.