Share News

ప్రభుత్వ భూమి కబ్జా

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:00 AM

ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు వాలిపోతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అనకాపల్లి మండలం కోడూరు రెవెన్యూ పరిధిలోని గొల్లపేటలో కోట్లాది రూపాయల విలువ చేసే సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని, తమ ఆధీనంలో వుంచుకున్నారు. సాగుదారులుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకున్నట్టు తెలిసింది.

ప్రభుత్వ భూమి కబ్జా
అనకాపల్లి మండలం కోడూరు రెవెన్యూ పరిధిలోని గొల్లపేటలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి ఇదే

రెండు సర్వే నంబర్లలో 4.04 ఎకరాలు ఆక్రమణ

ప్రైవేటు వ్యక్తి పేరున ఆన్‌లైన్‌లో నమోదు

రెవెన్యూ అధికారుల సహకారం

తెరవెనుక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు

వైసీపీ హయాంలోనే భూ దోపిడీ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు వాలిపోతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అనకాపల్లి మండలం కోడూరు రెవెన్యూ పరిధిలోని గొల్లపేటలో కోట్లాది రూపాయల విలువ చేసే సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని, తమ ఆధీనంలో వుంచుకున్నారు. సాగుదారులుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేయించుకున్నట్టు తెలిసింది.

అనకాపల్లి మండలం కోడూరు రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి సమీపంలో గొల్లపేట సర్వే నంబరు 319/1లో ఒక ఎకరా 96 సెంట్లు, సర్వే నంబరు 319/2లో రెండు ఎకరాల ఎనిమిది సెంట్లు.. మొత్తం నాలుగు ఎకరాల నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమి వుంది. సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అండగల్‌ రెవెన్యూ రికార్డు ప్రకారం ఈ భూమి అనాదీన పుంజ గయాలిగా నమోదైవుంది. అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన తరువాత కలెక్టరేట్‌కు అతి చేరువలో వున్న ఈ భూమిని కలెక్టరేట్‌ నిర్మాణానికి కేటాయించాలని 2023లో అప్పటి కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి భావించారు. అప్పటి ఆర్డీఓ చిన్నకృష్ణతో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు. కలెక్టరేట్‌ నిర్మాణానికి కనీసం 10 ఎకరాలు అవసరంకాగా, గొల్లపేటలో 4.04 ఎకరాలు మాత్రమే వుంది. అయినప్పటికీ ఈ భూమిని సంరక్షించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఈ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూమి అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారికి, కోడూరులో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కుకు సమీపంలో వుంది. ఇక్కడ జిరాయితీ భూమి ఎకరాల రూ.3 కోట్లపైనా ధర పలుకుతున్నది. దీంతో వైసీపీ హయాంలోనే కొంతమంది రియల్టర్ల కన్ను గొల్లపేటలోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిపై పడింది. ఆ పార్టీకి చెందిన స్థానిక నేతల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డులను తారుమారు చేసినట్టు తెలిసింది. సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి పేరున ఆన్‌లైన్‌లో మార్చినట్టు చెబుతున్నారు. భూమి చుట్టూ కంచె వేసి, భవన నిర్మాణ సామగ్రిని నిల్వ చేసి, ఈ భూమి తమ ఆధీనంలో వున్నట్టు స్థానికులను నమ్మబలుకుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ధరల ప్రకారం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి విలువ రూ.12 కోట్ల వరకు వుంటుందని అంటున్నారు.

రీ-సర్వేతో బయటపడనున్న ఆక్రమణ

జిల్లాలో ప్రస్తుతం రెండో విడత భూముల రీసర్వే జరుగుతున్నది. ఈ జాబితాలో కోడూరు రెవెన్యూ కూడా వుంది. సర్వే నంబర్లు 319/1, 319/2లో వున్న సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారో బయటపడుతుంది. దీనిపై కోడూరు వీఆర్వో అప్పలరాజును వివరణ కోరగా.. గొల్లపేటలో త్వరలో రీ-సర్వే జరుగుతుందని, ఎస్‌ఎఫ్‌ఏ రికార్డుల్లో నమోదు అయివుంటే అది ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తామని చెప్పారు. ఒకవేళ రీసర్వేలో పొరపాట్లు జరిగితే స్థానికులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Updated Date - Mar 04 , 2026 | 01:00 AM