వేరుశనగ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - May 27 , 2026 | 12:00 AM
వేరుశనగ పంట సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, గిరిజన రైతులు నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయశాఖ ఉప సంచాలకులు వైవీ రమణారావు తెలిపారు. మంగళవారం మండలంలోని చౌడుపల్లి పంచాయతీలో గిరిజన రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు.
- నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి చూపాలి
- వీసీసీ పథకంలో శతశాతం రాయితీపై విత్తనాలు
- జిల్లా వ్యవసాయశాఖ ఉప సంచాలకులు రమణారావు
చింతపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ పంట సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, గిరిజన రైతులు నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయశాఖ ఉప సంచాలకులు వైవీ రమణారావు తెలిపారు. మంగళవారం మండలంలోని చౌడుపల్లి పంచాయతీలో గిరిజన రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో వేరుశనగ పంట విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తుందన్నారు. గిరిజన ప్రాంతం వేరుశనగ సాగుకు అత్యంత అనుకూలమన్నారు. గిరిజన రైతులు ఆహారం కోసం అతితక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారన్నారు. వేరుశనగ పంటను వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో రెండు వేల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రైతులకు వీసీసీ పథకం ద్వారా శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు అధిన దిగుబడినిచ్చే మేలిజాతి టీసీజీఎస్ 1694 రకం విత్తనాలు అందజేశామన్నారు. విత్తనాలతో పాటు నీమ్ ఆయిల్, విత్తనశుద్ధి మందులు 50 శాతం రాయుతీపై పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు సాగుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామన్నారు. వచ్చే ఏడాదికి సాగు విస్తీర్ణం రెట్టింపు చేస్తామని చెప్పారు. గిరిజన రైతులు ప్రభుత్వం, వ్యవసాయశాఖ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేరుశనగ పంటలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బీవీ తిరుమలరావు, ఏవో టి.మధుసూదనరావు పాల్గొన్నారు.