సర్కారు ప్రోత్సాహం.. కాఫీ రైతులకు వరం
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:17 PM
మన్యంలో గిరిజన రైతులు కాఫీ తోటల పెంపకంతో ప్రతి ఏటా ఆదాయాన్ని పొందుతున్నారు.
నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి విలువైన పరికరాల పంపిణీ
425 మంది రైతులకు 85 శాతం రాయితీ
రూ.4.99 కోట్లు కేటాయింపు
కాఫీ శుద్దీకరణలో చక్కని ఫలితాలు
గిరిజన రైతుల ఆనందం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో గిరిజన రైతులు కాఫీ తోటల పెంపకంతో ప్రతి ఏటా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈక్రమంలో నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేసేందుకు రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహాన్ని అందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు భావించారు. కాఫీ ఉత్పత్తిలో మహిళల పాత్ర కీలకం కావడంతో ఎంపిక చేసిన మహిళా రైతులకు సాయం అందించేందుకు నిర్ణయించారు. ఇందుకుగానూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఏజెన్సీలో కొయ్యూరు మినహా పది మండలాల్లోని ఎంపిక చేసిన 425 మంది మహిళా కాఫీ రైతులకు 85 శాతం రాయితీపై వారికి అవసరమైన నాలుగు రకాల పరికరాలను అందించారు.
రైతులకు మరింత ప్రయోజనం
మహిళా రైతులకు అధికారులు అందించిన నాలుగు రకాల పరికరాలతో ఎటువంటి లబ్ధిచేకూరుతుందనేదానిపై అధికారులు గ్రామాల్లోని మహిళా సంఘాల ద్వారా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కాఫీ రైతులు మొక్కల నుంచి సేకరించిన గింజలను శుద్ధి చేసుకునేందుకు పల్ఫింగ్ యూనిట్, కాఫీ తోటల్లో అంతర పంటగా ఉన్న మిరియాలను సేకరించేందుకు అల్యూమినియమ్ నిచ్చెన, కాఫీ గింజలు, మిరియాలను ఆరబెట్టుకునేందుకు అవసరమైన డ్రైయింగ్ యార్డ్, పాలిథిన్ టార్పాలిన్లు అందించారు. ఆ నాలుగు పరికరాలు పొందిన కాఫీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో రైతుకు రూ.1లక్షా 27 వేలు విలువ చేసే నాలుగు పరికరాలను 85 శాతం రాయితీపై కేవలం రూ.26 వేల 70లకు అందించారు. ఈ 85 శాతం రాయితీలో కేంద్ర కాఫీ బోర్డు ద్వారా 50 శాతం రూ.56,900, ప్రధాన మంత్రి ఫుడ్ ప్రోసెసింగ్ యోజనలో 35 శాతం రాయితీ రూ.44,030 కల్పించారు. అలాగే మహిళా కాఫీ రైతులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సిన 15 శాతం వాటా(రూ.26,070) సొమ్మును కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రుణంగా అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఫలితంగా ఈఏడాది సీజన్‌లో ఆయా పరికరాలను వినియోగించుకుని గిరిజన కాఫీ రైతులు పలు విధాలుగా లబ్ధిపొందారు.