సర్కారు సహకారం
ABN , Publish Date - May 10 , 2026 | 12:49 AM
ఏళ ్ల తరబడి అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న సహకార సంఘాల ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. మెరుగైన వేతనాల పెంపు పాలసీ అమలుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఆరోగ్య బీమా పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోఆర్‌టీ నంబరు 322 జారీ చేసింది. వేతనాల పెంపు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సహకార సంఘాల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పీఏపీఎస్‌ల ఉద్యోగులకు వరాలు
మూల వేతనంపై 20 శాతం పెంపు
గ్రాట్యుటీ రెట్టింపు
రూ.5 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా
కొత్త హెచ్‌ఆర్ పాలసీ అమలు
చోడవరం, మే 9 (ఆంధ్రజ్యోతి): ఏళ ్ల తరబడి అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న సహకార సంఘాల ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వరాలజల్లు కురిపించింది. మెరుగైన వేతనాల పెంపు పాలసీ అమలుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఆరోగ్య బీమా పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోఆర్‌టీ నంబరు 322 జారీ చేసింది. వేతనాల పెంపు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సహకార సంఘాల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 98 సహకార సంఘాల్లో సుమారు 330 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి పీఆర్‌సీ వర్తించదు. సహకార సంఘాల్లో నిర్వహించిన వివిధ రకాల లావాదేవీలు.. అంటే రైతులకు రుణాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల విక్రయం, ధాన్యం సేకరణ వంటి ద్వారా వచ్చే ఆదాయంలో నుంచే వేతనాల చెల్లింపు జరుగుతుంది. దీంతో ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వీరి వేతనాలు ‘గొర్రె తోక బెత్తెడు’ అన్న చందంగా వుంటున్నాయి. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపుతోపాటు, గ్రాట్యుటీ, ఇతర సమస్యలు పరిష్కరించడానికి 2018లో తెలుగుదేశం హయాంలో అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. సహకార సంఘాల లావాదేవీలు, ఆదాయవ్యయాలు, ఉద్యోగుల వేతనాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ.. సహకార ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నివేదిక ఇచ్చింది. ఈ సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ హయాంలో వేసిన కమిటీ నివేదికను పక్కనపెట్టి, హెచ్‌ఆర్ పాలసీని అమలు చేస్తామంటూ జీవో నంబరు 36 విడుదల చేసింది. కానీ ఐదేళ్లపాటు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా వుండడంతో వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ పెంచాలని, ఆరోగ్య బీమాను అమలుచేయాలని, తదితర డిమాండ్లతో మూడు నెలల క్రితం ఆందోళనబాట పట్టారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. సహకార ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లలో కొన్నింటిని ఆమోదిస్తూ జీవోను విడుదల చేసింది. దీనిప్రకారం రెగ్యులర్ ఉద్యోగులకు మూల వేతనంలో 20 శాతానికి సమానంగా అదనపు వేతనం అందుతుంది. ఈ పెంపును ప్రత్యేక భాగంగా పరిగణించి మూలవేతనంలో కలపకూడదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.2 లక్షలుగా ఉన్న గ్రాట్యుటీని రూ.4 లక్షలకు పెంచింది. ప్రతి ఉద్యోగికి రూ.5 లక్షల కవరేజీతో సామూహిక ఆరోగ్య బీమా పథకం అమలవుతుంది. ఇప్పటి వరకు ఇది రూ.2 లక్షలుగా వుంది. బీమా ప్రీమియంలో ఉద్యోగి 30 శాతం, సంబంధిత సహకార సంఘం 35 శాతం, డీసీసీబీ 35 శాతం భరించాల్సి వుంటుంది. పీఏసీఎ్‌సల రుణ, రుణేతర కార్యకలాపాల ద్వారా వచ్చే నిధుల నుంచి ఉద్యోగులకు ఈ ప్రయోజనాల ఖర్చును భరించాలి.
కొత్త హెచ్ ఆర్ పాలసీ ప్రకారం ప్రతి ఉద్యోగి వివరాలు ఆన్‌లైన్ కావడంతో పాటు సంఘాల్లో కొత్త నియామకాలకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ ఆమోదం పొందవలసి ఉంటుంది. కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగికి కోడ్ నంబర్ కేటాయించడం దగ్గర నుంచి పూర్తి వివరాలు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఉద్యోగుల సర్వీసు వివరాలు, పేస్కేల్, ఇతర వాటి ఆధారంగా సహకార ఉద్యోగులకు రాష్ట్రస్థాయిలోనే వేతనాలు ఖరారు చేసి అమలు చేయనున్నారు. దీనివల్ల సహకార సంఘాల ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసాలు వుండవు.