ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఏయూ పూర్వ విద్యార్థే
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:28 AM
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన బి.సాయిప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి.
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన బి.సాయిప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఆయన ఏయూలో ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. ఆ తరువాత సివిల్స్‌కు వెళ్లారు. కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఏయూ పూర్వవిద్యార్థుల్లో సాయిప్రసాద్ రెండోవారు. గతంలో కాకి మాధవరావు సీఎస్‌గా పనిచేశారు. బి.సాయిప్రసాద్ నియామకం పట్ల ఏయూ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు.
రాగులు లేనట్టే..
ఇప్పటివరకూ డిపోలకు చేరలేదంటున్న డీలర్లు
బియ్యం,పంచదార, గోధుమపిండి మాత్రమే పంపిణీ
గోధుమపిండి జిల్లాకు 518 టన్నులు అవసరం
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 250 టన్నులే
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):
బియ్యం కార్డుదారులకు రాగుల పంపిణీ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. వచ్చే నెల ఒకటో తేదీన అంటే...ఆదివారం నుంచి కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి డిపోలకు సరుకులు సరఫరా చేశారు. రాగులు మాత్రం ఇంత వరకూ పౌరసరఫరాల సంస్థ గోదాములకు రాలేదు. నాలుగు వందల టన్నుల రాగులు కావాలని ప్రభుత్వానికి జిల్లా పౌర సరఫరాల సంస్థ ఇండెంట్ పెట్టింది. కానీ ఇప్పటివరకూ రాలేదని, అందువల్ల మార్చి నెలకు సరఫరా లేనట్టేనని డీలర్లు చెబుతున్నారు.
గత ఏడాది డిసెంబరు నెల నుంచి రాగులు పంపిణీ చేస్తున్నారు. ముందుగా వెళ్లిన కార్డుదారులకు మూడు కిలోల బియ్యానికి బదులు రాగులు ఉచితంగా అందజేశారు. ప్రతి డిపోకు 200 కిలోల వంతున మాత్రమే సరఫరా చేయడంతో పదో తేదీ తరువాత డిపోలకు వెళ్లిన కార్డుదారులకు రాగులు అందేవి కావు. అయితే కార్డుదారుల నుంచి డిమాండ్ ఉందని డీలర్లు చెప్పడంతో మార్చి నెలకు సంబంఽధించి 400 టన్నుల కోసం ఇండెంట్ పెట్టారు. రాగులు సరఫరా కాకపోవడంతో అదే విషయం డీలర్లకు సమాచారం ఇచ్చారు.
ఇదిలావుండగా కార్డుదారులకు కిలో గోధుమపిండి రూ.20కు విక్రయిస్తున్నారు. ఇందుకోసం మార్చి నెలకుగాను డీలర్లకు పాక్షికంగా స్టాకు సరఫరా చేశారు. ఫిబ్రవరి నెలలో కార్డుదారులకు సరఫరా చేయగా కొంత డీలర్ల వద్ద ఉండిపోయింది. పాత స్టాకుతో కలిపి మార్చి నెలకుగాను డీలర్ల వద్ద 280 టన్నుల గోధుమపిండి ఉంది. ఫిబ్రవరి నెలలో 80 శాతం గోధుమపిండి మాత్రమే అమ్మకాలు జరిగాయి. కొందరు కార్డుదారులకు అడిగినంత పిండి పంపిణీ చేశారు. మార్చి నెలలో డీలర్ల వద్ద ఉన్న స్టాకు మొత్తం అమ్మకాలు జరిగే అవకాశం తక్కువని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అయినా ప్రతి డీలర్ తమ పరిధిలో ఉన్న కార్డుల సంఖ్యకు తగ్గట్టుగా గోధుమపిండికి సొమ్ములు చెల్లించాలని పౌర సరఫరాల అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లాలో 5.18 లక్షల కార్డులు ఉండగా ప్రతి కార్డుకు కిలో గోధుమపిండి పంపిణీ చేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగా జిల్లాకు 518 టన్నుల స్టాకు రావల్సి ఉండగా, 250 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. అటువంటప్పుడు మొత్తం కార్డులకు సొమ్ములు చెల్లించాలని ఎలా అడుగుతారని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం డీలర్ల సంఘ నేతల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
మళ్లీ కొండెక్కిన కోడి
స్కిన్‌లెస్ కిలో రూ.310
ధర మరింత పెరిగే అవకాశం
కోళ్లకు కొరత రావడమే కారణం
విశాఖపట్నం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): బ్రాయిలర్ కోడి మాంసం ధర మరోసారి భారీగా పెరిగింది. ఆదివారం స్కిన్‌లెస్ కిలో రూ.310లుగా నిర్ణయించారు. వచ్చే వారంలో ధరలు మరింత పెరుగుతాయని కోళ్ల రైతులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్టు కోళ్లు ఫారాల్లో లేకపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోళ్లకు కొరత వచ్చింది. గత ఏడాది చివరి మూడు నెలల్లో బ్రాయిలర్ కోళ్లకు పలు సమస్యలు రావడంతో అనేకమంది రైతులు పెంపకం బాగా తగ్గించారు. కంపెనీలు కూడా అదేబాటలో నడిచాయి. దీంతో జనవరి నెల తొలివారంలో చికెన్ ధరలు తొలిసారిగా రూ.300 మార్కును దాటాయి. ఆ తరువాత రూ.310కు చేరింది. కోళ్ల పరిశ్రమలో అదే రికార్డు ధరగా చెబుతారు. ఆ తరువాత ధరలు తగ్గినా మరోసారి కోళ్ల కొరత ఏర్పడడంతో ధర పెరుగుతోంది. ప్రస్తుతం కోడి పిల్ల ఒకటి రూ.65కు చేరింది. కోడి పిల్ల ధర రూ.60 దాటడం ఇదే తొలిసారి అని బ్యాగ్ మాజీ అధ్యక్షుడు థాట్రాజు అప్పారావు తెలిపారు. తల్లి కోళ్ల కొరత వల్ల ప్రస్తుతం పిల్లల ఉత్పత్తి తగ్గడం, ఐదారు నెలల క్రితం పరిశ్రమ దెబ్బతినడంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయన్నారు. కాగా మన రాష్ట్రం కంటే ఒడిశాలో తక్కువకు కోళ్లు లభించేవని, ప్రస్తుతం అక్కడ కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయని బ్యాగ్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరాంధ్రలో డిమాండ్‌కు తగినంతగా కోళ్లు లేకపోవడంతో గోదావరి జిల్లాల నుంచి వస్తున్నాయన్నారు. వచ్చే వారంలో ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.