నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:53 PM
అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. శింగవరంలోని జీసీసీ ఎంఎల్‌ఎస్ గిడ్డంగి, కాకరపాడు బాలికల పోస్టు మెట్రిక్ హాస్టల్ భవనం, భోజనశాల వృథాగా పడి ఉన్నాయి. కేవలం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా వీటికి ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోట్లాది రూపాయలు వృథా
అధికారుల అనాలోచిత నిర్ణయాలు..
కొయ్యూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
మండలంలో శింగవరంలో నిర్మించిన జీసీసీ ఎంఎల్‌ఎస్ గోదాము గత ఎనిమిదేళ్లుగా వృథాగా పడి ఉంది. మండలంలో మారుమూల ప్రాంతాల్లోని డీఆర్ డిపోలకు నిత్యావసర సరుకులు తరలించేందుకు అధిక వ్యయం అవుతున్నందున ఈ మొత్తాన్ని తగ్గించేందుకు ఎంఎల్‌ఎస్ గోదాము నిర్మాణానికి ప్రభుత్వం 2018వ సంవత్సరంలో రూ.26 లక్షలు మంజూరు చేసింది. కొయ్యూరు తహశీల్దార్ కార్యాలయం వెనుక, కాకరపాడులో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ ఆ రెండింటిలో నిర్మాణం చేపట్టలేదు. అధికారులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది అనాలోచిత నిర్ణయం కారణంగా రక్షణ లేని శింగవరం శ్మశాన వాటిక సమీపంలో గోదామును నిర్మించారు. ఈ గోదాము కూడా ప్రధాన రహదారికి సమాంతరంగా కాకుండా లోతులో నిర్మించారు. దీంతో ఈ గోదాములో సరుకులు నిల్వ చేస్తే వాటికి రక్షణ ఉండదు. అంతేకాకుండా గోదామునకు వెళ్లేందుకు రోడ్డు కూడా లేదు. లోతు ప్రాంతంలో గోదాము ఉండడం వల్ల నీరు చేరే అవకాశం ఉండడంతో దీనిని వినియోగించకపోవడంతో ఎనిమిదేళ్లుగా వృథాగా పడి ఉంది.
అలాగే 2017వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో కాకరపాడు గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలకు అనుసంధానంగా బాలికల పోస్టు మెట్రిక్ హాస్టల్ భవనాన్ని నిర్మించారు. మండలంలో పదో తరగతి పాసైన తర్వాత విద్యాభ్యాసం చేసేందుకు బాలికలకు అవకాశం లేకపోవడంతో ఇక్కడ గ్రూపునకు 10 మంది వంతున ప్రతీ విద్యా సంవత్సరంలో 60 మంది విద్యార్థినులకు కళాశాలలో ప్రవేశాలు ఇచ్చి వారికి పోస్టు మెట్రిక్ హాస్టల్‌లో వసతి కల్పించారు. అంతేకాకుండా కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు కూడా ఇక్కడ అవకాశం కల్పించడంతో వారికి కూడా వసతి సమస్య తీరింది. అయితే అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం మూడేళ్లు పాటు ఈ వసతి గృహ భవనాన్ని నిర్వహించింది. తర్వాత కాకరపాడు గురుకుల కళాశాలలో బాలికల ప్రవేశానికి ఇచ్చే అనుమతులు నిలిపి వేసింది. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థినులు పరీక్షలు రాసి వెళ్లిపోవడంతో ఈ హాస్టల్ మూతపడింది. అప్పటి నుంచి ఇది నిరుపయోగంగా ఉంది. ఈ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులకు భోజనం వండేందుకు నిర్మించిన వంటశాల భవనం కూడా నిరుపయోగంగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ భవనాల వినియోగానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.