గిరిజన హక్కుల రక్షణకు సర్కారు భరోసా
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:05 AM
రాజ్యాంగపరంగా గిరిజనులకు సంక్రమించిన హక్కులు, చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. గిరిజన ప్రాంతానికి సంబంధించిన జీవో:3, 1/70 చట్టం, జోన్-1 పై గిరిజనులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేస్తామని గత నెలలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అల్లూరి జిల్లాను జోన్- 1నే కొనసాగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
- జీవో: 3 పునరుద్ధరణ, 1/70 చట్ట పరిరక్షణపై ఇప్పటికే స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు
- అల్లూరి జిల్లాను జోన్- 1లోనే కొనసాగించాలని ఉన్నతాధికారులకు ఆదేశం
- తాజాగా గిరిజన సంఘాల నేతలతో మంత్రులు అనిత, సంధ్యారాణి భేటీ
- ఆదివాసీలకు న్యాయం చేస్తామని స్పష్టీకరణ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాజ్యాంగపరంగా గిరిజనులకు సంక్రమించిన హక్కులు, చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. గిరిజన ప్రాంతానికి సంబంధించిన జీవో:3, 1/70 చట్టం, జోన్-1 పై గిరిజనులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేస్తామని గత నెలలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అల్లూరి జిల్లాను జోన్- 1నే కొనసాగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
గిరిజనుల సమస్య పరిష్కారానికి ఆయా గిరిజన సంఘాల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ మేరకు గత నెల 28న రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్, జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలతో పాటు ఇతర ఉన్నతాధికారులు గిరిజన సంఘాల నే తలతో సమావేశమయ్యారు. జిల్లా స్థాయి అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిపి ఒక ‘ఉన్నత స్థాయి కమిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియ జోరుగా జరుగుతున్నది. తాజాగా గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలిపేందుకు వివిధ గిరిజన సంఘాల నేతలతో కలెక్టరేట్‌లో కలెక్టర్ టి.నిషాంతి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆయా సమస్యలను పరిష్కరిస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.
కనీసం స్పందించని గత వైసీపీ ప్రభుత్వం
గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించిన ఏ సమస్యపైనా కనీసం స్పందించలేదు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉండగానే 2020 ఏప్రిల్‌లో జీవో:3ని సుప్రీం కోర్డు రద్దు చేసింది. ఆ తరువాత నాలుగేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దానిపై కనీసం స్పందించ లేదు. ఈ సమస్యపై అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం, కార్పొరేట్ విద్యా పథకం, అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాలను పూర్తిగా రద్దు చేసింది. గిరిజనులకు రాయితీపై స్వయం ఉపాధి యూనిట్‌లు అందించే ట్రైబల్ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది. ఎస్‌టీ రిజర్వేషన్ ద్వారా అందించాల్సిన ఎటువంటి పథకాలను అమలు చేయలేదు. ఆఖరుకు జగనన్న కాలనీల పేరిట కనీసం ఒక గిరిజనుడికి కూడా ఇల్లు కట్టించని పరిస్థితి కొనసాగింది. అయితే అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు పోలీసుల ఒత్తిళ్లకు భయపడి గిరిజనుల సమస్యలపై ఆశించిన స్థాయిలో ఉద్యమాలు, పోరాటాలు చేయలేకపోయారు. కాగా కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా గిరిజన సమస్యలపై తక్షణమే స్పందించడంతో పాటు వారి సమస్యలపై గిరిజన సంఘాల నేతలతో భేటీలు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరిస్తుండడం విశేషం. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగిస్తుండడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో:3 పునరుద్ధరణ, ఇతర అంశాలపైనా తమ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని, అందుకు సమయం ఇవ్వాలని, ఆందోళనల పేరిట రాద్ధాంతం చేయవద్దని ఆమె కోరుతున్నారు.