Share News

గోవాడ రైతు దిగాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:46 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడడంతో చెరకు రైతుల కష్టాలు మరింత పెరిగాయి.

గోవాడ రైతు దిగాలు

సంకిలి ఫ్యాక్టరీకి చెరకు సరఫరా

రవాణా చార్జీల పేరుతో టన్నుకు రూ.750 మేర కోత

కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.3,550

రైతులకు రూ.2,800 మాత్రమే చెల్లింపు

సాగు ఖర్చులు కూడా రావని రైతుల ఆవేదన

చోడవరం, జనవరి5 (ఆంధ్రజ్యోతి):

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడడంతో చెరకు రైతుల కష్టాలు మరింత పెరిగాయి. ఈ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించాలంటూ షుగర్‌కేన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోగా, రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రవాణా ఖర్చులను తమపై మోపుతూ, మద్దతు ధరలో కోత విధిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ను అధికారులు రద్దుచేసిన విషయం తెలిసిందే. అప్పటికే వేలాది ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేపట్టారు. దీంతో రైతులు ఇబ్బంది పడకుండా వుండేందుకు రాష్ట్ర షుగన్‌ కేన్‌ కమిషన్‌ అధికారులు, గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో సాగు చేసిన చెరకును శ్రీకాకుళం జిల్లా సంకిలిలోని ప్రైవేటు షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించాలని ఆదేశించారు. చోడవరం- సంకిలి మధ్య దూరం సుమారు 175 కిలోమీటర్లు. దీంతో చెరకు రవాణా చార్జీలు ఎవరు భరించాలో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. తమకు సంబంధం లేదని గోవాడ షుగర్స్‌ యాజమాన్యం తప్పించుకుంది. షుగర్‌ కేన్‌ అధికారులు చెప్పడం వల్లనే సుదూరంలో వున్న గోవాడ ఫ్యాక్టరీ పరిధి నుంచి చెరకును తీసుకెళుతున్నామని, అందువల్ల రవాణా చార్జీలు తాము భరించలేమని సంకిలి ఫ్యాక్టరీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో గోవాడ రైతులకు ఏం చేయాలో పాలుపోలేదు. 2025-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్ను రూ.3,550గా గతంలోనే ప్రకటించింది. కానీ సంకిలి ఫ్యాక్టరీ అధికారులు, గోవాడ రైతులకు రూ.2,800 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన రూ.750 రవాణా చార్జీల కింద మినహాయిస్తున్నారు. గతంలో గోవాడ ఫ్యాక్టరీ యాజమాన్యం కాటాల వద్దకు రైతులు తీసుకువచ్చిన చెరకును రవాణా ఖర్చులు భరించి ఫ్యాక్టరీకి తరలించేది. ఒకవేళ ఫ్యాక్టరీ నేరుగా చెరకును తీసుకువస్తే.. టన్నుకు రూ.60 చొప్పున రవాణా ఖర్చులు ఇచ్చేది. కానీ ఇప్పుడు సంకిలి ఫ్యాక్టరీ యాజమాన్యం రవాణా ఖర్చుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సంకిలి ఫ్యాక్టరీ చెప్పిన ధరకు చెరకును అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడి కూడా రాదు

కనిశెట్టి అప్పారావు, శరగడం గోపి

చెరకు రైతులు, పీఎస్‌ పేట, చోడవరం మండలం

టన్ను చెరకుకు కనీసం రూ.3,200 అయినా ఇస్తారని అనుకన్నాం. కానీ రూ.2,800 మాత్రమే చెల్లించడం దారుణం. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా ఇది రూ.750 తక్కువ. దీనివల్ల సాగు ఖర్చులు కూడా రావు. ఎన్ని కష్టాల్లో వున్నప్పటికీ గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ నడుస్తుందన్న ఉద్దేశంతోనే చెరకు సాగు చేపట్టాం. లేకపోతే వేరే పంటలు వేసుకునేవాళ్లం.

Updated Date - Jan 06 , 2026 | 01:46 AM