వడివడిగా గూగుల్ అడుగులు
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:05 AM
ప్రపంచమంతా నివ్వెరపోయేలా విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి 28న శంకుస్థాపన
తొలిదశలో 580 మెగావాట్ల విద్యుత్ కోసం కంపెనీ దరఖాస్తు
మొత్తం మూడు ప్రాంతాల్లో కలిపి మొత్తం వెయ్యి మెగావాట్లు అవసరం
మరోవైపు నిర్మాణ పనులకు అడ్డంకి లేకుండా తర్లువాడ, అడవివరం ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మార్పు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రపంచమంతా నివ్వెరపోయేలా విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 28న ఆనందపురం మండలం తర్లువాడలో శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెంటర్‌కు అవసరమైన విద్యుత్ కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక గిగావాట్ (వెయ్యి మెగావాట్లు) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటుచేస్తామని గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం మూడు ప్రాంతాల్లో (తర్లువాడ, ముడసర్లోవ/అడవివరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి) భూములు తీసుకుంది. మూడుచోట్ల కలిపి వేయి మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు నిర్మిస్తుంది. వాటికి అవసరమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. విశాఖపట్నం జిల్లా అంతటికీ ఒక రోజుకు అవసరమైన విద్యుత్ లోడ్ డిమాండ్ వేయి మెగావాట్లు. అంతే విద్యుత్ ఇప్పుడు గూగుల్‌కు అవసరం. దీనిని ఈపీడీసీఎల్ కాకుండా నేరుగా ట్రాన్స్‌కో సమకూరుస్తుంది.
మూడు సెంటర్లకు వేర్వేరుగా దరఖాస్తులు
తొలిదశలో తర్లువాడకు 260 మెగావాట్లు, ముడసర్లోవ/అడవివరానికి 160 మెగావాట్లు, రాంబిల్లికి మరో 160 మెగావాట్లు మొత్తం 580 మెగావాట్ల విద్యుత్ కావాలని గూగుల్ తరఫున ఏర్పాటైన రైడెన్ ఇన్ఫోటెక్ కంపెనీ ఈపీడీసీఎల్‌కు దరఖాస్తు చేసింది. వాటిని ఇక్కడి అధికారులు ట్రాన్స్‌కోకు పంపించారు. 300 మెగావాట్లు సామర్థ్యం దాటి కంపెనీలు పెట్టే సంస్థలు వాటి విద్యుత్‌లో 51 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. అది గూగుల్‌కు కూడా వర్తిస్తుంది. అంటే గూగుల్ తనకు అవసరమైన వెయ్యి మెగావాట్లలో 510 మెగావాట్లు సోలార్/విండ్/పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ సమకూర్చుకోవలసి ఉంటుంది.
విద్యుత్ లైన్ల మార్పునకు ప్రయత్నాలు
తర్లువాడ, ముడసర్లోవల్లో గూగుల్‌కు కేటాయించిన భూముల్లో ఎల్‌టీ, 11 కేవీ విద్యుత్ లైన్లు ఉన్నాయి. వాటిని అక్కడి నుంచి తొలగించి భూములు అప్పగించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్ పంపు సెట్లు కూడా ఉన్నాయి. కొన్ని సింహాచలం దేవస్థానానికి చెందినవి కాగా, మరికొన్ని ఉద్యానవన శాఖకు చెందినవి ఉన్నాయి. ఆ లైన్ల తొలగింపునకు వారి అనుమతులు అవసరం. ప్రస్తుతానికి రైతుల భూముల్లో లైన్లను పక్కకు జరుపుతున్నారు. ఆయా సంస్థల అనుమతులు వచ్చాక ఆ పనులు కూడా చేపట్టడానికి ఈపీడీసీఎల్ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
తర్లువాడలో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్
తర్లువాడలో తొలుత పనులు ప్రారంభిస్తున్నందున అక్కడ తాత్కాలిక కనెక్షన్ ఒకటి తీసుకోవలసి ఉంటుంది. ఇది 40 కేవీ కనెక్షన్ కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. గూగుల్ సంస్థ అయితే దీనికి ఇంకా దరఖాస్తు చేయలేదు. వారు ముందుకువస్తే ఆనందపురం లేదా గిడిజాల నుంచి లైన్ వేసి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని ఈపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి.