Share News

మార్చి నుంచి గూగుల్‌ పనులు

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:08 AM

డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం గూగుల్‌ సంస్థకు ఈ నెల పదో తేదీకల్లా ఆనందపురం మండలం తర్లువాడలో భూమి అప్పగిస్తామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ వెల్లడించారు. తర్లువాడలో మొత్తం 308 ఎకరాలు గూగుల్‌కు కేటాయించామని, డీ పట్టా రైతుల్లో సగం మంది భూములు అప్పగించారని, మిగిలినవారు కూడా సంసిద్ధత వ్యక్తంచేశారని పేర్కొన్నారు.

మార్చి నుంచి గూగుల్‌ పనులు

ఈ నెల పదో తేదీకల్లా తర్లువాడలో భూముల అప్పగింత

మూడో వారంలో టీసీఎస్‌ క్యాంపస్‌ ప్రారంభం

పెట్టుబడులసదస్సులో కుదిరిన ఒప్పందాల అమలుపై ఫోకస్‌

రెండేళ్లలో 20 వేల ఉద్యోగాల కల్పన

కాలుష్యం తగ్గింపే లక్ష్యంగా కఠిన చర్యలు

కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):

డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం గూగుల్‌ సంస్థకు ఈ నెల పదో తేదీకల్లా ఆనందపురం మండలం తర్లువాడలో భూమి అప్పగిస్తామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ వెల్లడించారు. తర్లువాడలో మొత్తం 308 ఎకరాలు గూగుల్‌కు కేటాయించామని, డీ పట్టా రైతుల్లో సగం మంది భూములు అప్పగించారని, మిగిలినవారు కూడా సంసిద్ధత వ్యక్తంచేశారని పేర్కొన్నారు.

2026లో కొత్త కంపెనీల ఏర్పాటు, అభివృద్ధి పనులు, కాలుష్య నివారణకు తీసుకోనున్న చర్యలను బుధవారం తనను కలిసిన విలేకరులకు ఆయన వివరించారు. డేటా సెంటర్‌ పనులు మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. అడవివరంలో గూగుల్‌కు సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు ఫైలు ప్రభుత్వం వద్ద ఉందన్నారు. పెట్టుబడుల సదస్సులో జిల్లాకు సంబంధించి జరిగిన 98 ఒప్పందాల అమలుపై ఫోకస్‌ పెడతామన్నారు. ఈ ఒప్పందాల అమలుతో రూ.99 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న విశాఖ జిల్లాలో 17 నుంచి 20 ప్రాజెక్టులకు ప్రణాళిక రూపొందించామని, అందుకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పెట్టుబడుల ఒప్పందాలు అమలు, విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో వచ్చే ప్రాజెక్టుల ద్వారా తొలుత 20 వేల పైచిలుకు ఉద్యోగాలు వస్తాయని అంచనావేశారు. జనవరి నెల మూడో వారంలో టీసీఎస్‌ ప్రారంభం అవుతుందని, దీనికి సంబంధించి ఇప్పటికే పనులు పూర్తయ్యాయన్నారు. నగరంలో కాలుష్య నియంత్రణకు 2026లో తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించిన పలు పరిశ్రమలకు సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు పర్యావరణ పరిహారం విధించామన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. 2026 జిల్లా అభివృద్ధిని మలుపుతిప్పే సంవత్సరంగా రూపొందబోతుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు.

బొకేలు, స్వీట్లు వద్దు..సంజీవని నిధికి విరాళాలు ఇవ్వండి

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పరస్పర శుభాకాంక్షలు తెలిపే క్రమంలో పూలబొకేలు, స్వీట్లు, మొక్కలు తీసుకురావద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. వాటి బదులు పేదలకు, అనారోగ్య బాధితులకు ఉపయోగపడేందుకు నెలకొల్పిన సంజీవని నిధి-డిస్ట్రిక్టు రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని కోరారు. సంజీవని నిధి-డిస్ట్రిక్టు రిలీఫ్‌ ఫండ్‌ ఖాతా సంఖ్య 50100500766040, బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌-హెచ్‌డీఎఫ్‌సీ 0009179.

Updated Date - Jan 01 , 2026 | 01:08 AM