Share News

ఇక సెలవ్‌!

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:04 AM

విశాఖపట్నం విమానాశ్రయం పౌర సేవలకు వీడ్కోలు పలికింది.

ఇక సెలవ్‌!

విశాఖ విమానాశ్రయం నుంచి నిలిచిపోయిన రాకపోకలు

ముగిసిన నాలుగున్నర దశాబ్దాల చరిత్ర

ఇక వీఐపీల విమానాలకే పరిమితం

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం విమానాశ్రయం పౌర సేవలకు వీడ్కోలు పలికింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఉత్తరాంధ్ర ప్రజలకు సేవలందించిన ఈ విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. భోగాపురంలో కొత్త విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఒప్పందం ప్రకారం దీనిని ఆదివారం అర్ధరాత్రితో మూసివేశారు.

విమానాశ్రయాన్ని నడపలేకనో, సామర్థ్యం లేకనో కాకుండా కేవలం జీఎంఆర్‌తో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి 30 ఏళ్లు పౌర విమాన సేవలు నిలిపివేస్తున్నట్టు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది. ఆదివారం రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో సర్వీసే ఆఖరి విమానంగా డైరెక్టర్‌ వెల్లడించారు. సోమవారం నుంచి ఈ విమానాశ్రయానికి పౌర విమానాలేవీ రావు. ఈ విమానాశ్రయం ఆధీనంలో 370 ఎకరాల భూమి, రూ.150 కోట్ల విలువైన నిర్మాణాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి కార్గో విమానాలు నడపాలని ఒకవర్గం సూచిస్తుండగా, మరో వర్గం విజయవాడ, హైదరాబాద్‌, తిరుపతి విమానాలను జీఎంఆర్‌ ఇక్కడి నుంచే నడపాలని సూచిస్తోంది. అయితే వీటిపై ఏమి చేస్తారో వేచి చూడాలి. విశాఖ ప్రజలకు దుబాయ్‌, సింగపూర్‌, బ్యాంకాక్‌, శ్రీలంక, మలేషియా దేశాలకు వెళ్లడానికి అంతర్జాతీయ సేవలందించిన ఈ విమానాశ్రయం ఇకపై పూర్తిగా ప్రైవేటు విమానాలకే పరిమితమవుతుంది.


భోగాపురం ఎయిర్‌పోర్ట్టుకు రెండు మార్గాల్లో ఏరో బస్సులు

ప్రతి అర గంటకు ఒక సర్వీసు

ప్రయాణ చార్జీలు ఖరారు చేసిన ఆర్టీసీ

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం ఎయిర్‌పోర్టులో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి రెండుమార్గాల్లో ఎయిర్‌పోర్టుకు ఏరో బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఎస్‌ఆర్‌-1, ఏఎస్‌ఆర్‌-2 పేర్లతో వీటిని నడుపుతున్నామన్నారు. ఏఎస్‌ఆర్‌-1 రూట్‌లో గాజువాక, ఎన్‌ఏడీ జంక్షన్‌, గురుద్వారా, జూపార్కు, మారికవలస, ఆనందపురం, తగరపువలస మీదుగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టుకు బస్సులు చేరుకుంటాయన్నారు. ఏఎస్‌ఆర్‌ -2 రూట్‌లో గాజువాక, సింధియా, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, సిరిపురం, ఇస్కాన్‌టెంపుల్‌, ఐటీ హిల్స్‌, మారికవలస, ఆనందపురం, తగరపువలస మీదుగా ఏఎస్‌ఆర్‌ ఎయిర్‌పోర్టుకి బస్సులు చేరుతాయన్నారు.

ఏరో బస్సు ప్రయాణ చార్జీలివి...

ఏఎస్‌ఆర్‌ రూట్‌ నంబరు -1

పాతగాజువాక నుంచి రూ.400

ఎన్‌ఏడీ నుంచి రూ.350

గురుద్వార నుంచి రూ.300

జూపార్కు నుంచి రూ.250

మారికవలస నుంచి రూ.200

ఆనందపురం నుంచి రూ.150

తగరపువలస నుంచి రూ.100

ఎయిర్‌పోర్టు జంక్షన్‌ నుంచి రూ.50

ఏఆస్‌ఆర్‌-2 రూట్‌ బస్సులకు...

పాతగాజువాక జంక్షన్‌ నుంచి రూ.400

సింథియా నుంచి రూ.400

కంచరపాలెం నుంచి రూ.400

సిరిపురం జంక్షన్‌ నుంచి రూ.350

ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి రూ.300

ఐటీ హిల్స్‌ నుంచి రూ.250

మారికవలస నుంచి రూ.200

ఆనందపురం నుంచి రూ.150

తగరపువలస నుంచి రూ.100

ఎయిర్‌పోర్ట్‌ జంక్షన్‌ నుంచి రూ.50


98 ఏళ్ల కిందటే విశాఖ గగనంలో విమానం

కాకినాడ నుంచి చిల్కా సరస్సు వైపు వెళ్లిన సీప్లేన్స్‌

తిలకించేందుకు రోడ్లపైకి వచ్చిన జనం

విమానాశ్రయం మూసివేతతో ఇక నగరం మీదుగా కనిపించని విమానాలు

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి పౌర విమాన సేవలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా విశాఖ మీదుగా ఎగరుతూ నగరవాసులను కనువిందు చేసిన విమానాలు ఇక కనిపించవు. అయితే, విశాఖ (అప్పట్లో వైజాగపట్నంగా పిలిచేవారు) ఆకాశం మీదుగా తొలిసారి విమాన ప్రయాణం (సీప్లేన్‌) సుమారు 98 ఏళ్ల కిందటే జరిగింది. 1928 జనవరి 23న రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన నాలుగు సూపర్‌మెరైన్‌ సౌతాంప్టన్‌-2 ఫ్లయింట్‌ బోట్‌ (సీప్లేన్స్‌) కాకినాడ నుంచి చిల్కా సరస్సు వైపు వెళ్తూ విశాఖపై ప్రయాణించినట్టు చరిత్ర చెబు తోంది. అప్పట్లో కొత్తగా నిర్మాణంలో ఉన్న విశాఖ హార్బర్‌ ను పరిశీలించేందుకు ఈ విమానాల నుంచి వైమానిక ఛాయా చిత్రాలను కూడా తీసినట్టు చెబుతున్నారు. ఉదయం కాకినాడ నుంచి బయలుదేరిన విమానాలు విశాఖ తీరానికి చేరుకుని హార్బర్‌ నిర్మాణ ప్రాంతం చుట్టూ చక్కర్లు కొట్టాయి. తొలిసారి ఆకాశంలో విమానాలను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. వాల్తేరు మీదుగా విమానాలు వెళ్తున్న సమయంలో అప్పటి కలెక్టర్‌ ఏజే కింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు ప్రకారం ఒక సందేశాన్ని విమానం నుంచి కిందకు విడిచిపెట్టినట్టు చెబుతున్నారు. అప్పట్లో ఫ్లయింగ్‌ బోట్లకు అనుకూలమైన జల వనరులున్న నేపథ్యంలో విశాఖ భవిష్యత్తులో అంతర్జాతీయ ఫ్లయింగ్‌ బోట్ల స్థావరంగా మారే అవకాశం ఉందనే ఆలోచన కూడా ఉండేదని భావించారు. ఇదిలా ఉండగా విశాఖలో తొలిసారి ఎగిరిన విమానాలకు సంబంధించిన విషయాలను విశాఖలో పుట్టి పెరిగి ఐదు తరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధముండి, ఆస్ర్టేలియాలో నివసిస్తున్న జాన్‌ కాస్టెల్లాస్‌ తన పరిశోధనాత్మక కథనాల్లో తెలియజేశారు. విశాఖ చరిత్ర, వారసత్వంతపై ఆసక్తిని కలిగిన ఆయన అనేక సంస్థలకు రాసిన వ్యాసాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. కాగా తొలిసారి 98 ఏళ్ల కిందట విశాఖ ఆకాశంలో ఎగిరిన విమానాలను చూసిన నగరవాసులు తాజాగా దానిని కోల్పోయారు.


మరో ఏడాది కొనసాగించాలి

ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం విమానాశ్రయాన్ని కనీసం మరో ఏడాది కొనసాగించాలని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. డాబాగార్డెన్స్‌లో ఆదివారం బీజేపీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం విమానాశ్రయంతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం చేరుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని, అదనపు ఖర్చవుతుందని ఆరోపించారు. బీచ్‌రోడ్డులో కోస్టల్‌ కారిడార్‌, ఎన్‌హెచ్‌-16 విస్తరణ పనులు పూర్తయ్యేవరకు విశాఖలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మరో మూడు గంటలు విమానాశ్రయం నడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. యూజర్‌ డెవలప్‌మెంట్‌ చార్జీలు తీసుకుని విజయవాడ, హైదరాబాద్‌, తిరుపతి నగరాలకు ఉదయం మూడు, సాయంత్రం మూడు విమానాలు నడిపేలా జీఎంఆర్‌ యాజమాన్యాన్ని ఒప్పించాలని, విశాఖ వాసుల్లో అత్యధికులు ఇదే కోరుకుంటున్నారన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:04 AM