Share News

దివ్యాంగులకు తీపికబురు

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:46 AM

దివ్యాంగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సదరం స్లాట్‌ బుకింగ్స్‌ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించింది.

దివ్యాంగులకు తీపికబురు

  • అన్ని రకాల వైకల్యాలకు సదరం ధ్రువపత్రాలు

  • ప్రస్తుతం 16 కేటగిరీలకు మాత్రమే అవకాశం

  • కొత్తగా మరో ఐదు కేటగిరీలకు చెందిన బాధితులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

  • సదరం స్లాట్‌ బుకింగ్స్‌ ప్రారంభం

  • 30 నుంచి గుర్తించిన ఆస్పత్రుల్లో శిబిరాల నిర్వహణ

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

దివ్యాంగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సదరం స్లాట్‌ బుకింగ్స్‌ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వైకల్యంతో బాధపడుతున్న వారికి కొత్తగా సదరం సర్టిఫికెట్లు మంజూరుచేసేందుకు అవకాశం ఏర్పడనుంది. ఈసారి సదరం సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. వైకల్యాల కేటగిరీల్లో మరికొన్నింటిని చేర్చింది. దీంతో మరింత మందికి మేలు చేకూరనుంది. కొత్తగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం 21 రకాల కేటగిరీలకు సంబంధించినవారు స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

కొత్తగా ఐదు కేటగిరీలకు అవకాశం

ప్రస్తుతం 16 కేటగిరీలకు సంబంధించిన వారికి ఆరోగ్య శాఖ సదరం సర్టిఫికెట్లను మంజూరుచేస్తోంది. తాజాగా మరో ఐదు కేటగిరీలకు సంబంధించిన సమస్యలను అందులో చేర్చింది. దీంతో మొత్తం 21 కేటగిరీల్లో బాఽధితులకు పరీక్షలు నిర్వహించి 40 శాతానికిపైగా వైకల్యం ఉన్నట్టు నిర్ధారిస్తే సదరం సర్టిఫికెట్లను జారీచేస్తారు. ప్రస్తుతం కుష్టు, పోలియో/ప్రమాదాల వల్ల వైకల్యం (లోకోమోటార్‌ డిజిబులిటీ), మరుగుజ్జు, సెరిబ్రల్‌ పాల్సీ, మస్కిలర్‌ డిస్ర్టోఫీ (కండరాలు క్రమంగా బలహీనపడే వ్యాధి), క్రానిక్‌ న్యూరోలాజికల్‌ కండిషన్స్‌, మల్టీపుల్‌ స్కెలోరోసిస్‌, పార్కిన్సన్‌, వినికిడి సమస్య, మెంటల్‌ ఇల్‌నెస్‌ (మానసిక సమస్యలు), మందబుద్ధి/బుద్ధి మాంద్యం (ఇంటలెక్చువల్‌ డిజిబులిటీ), అంధత్వం, లోవిజన్‌ (కంటి చూపు మందగించడం), హీమోఫీలియా, తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు ఇప్పటివరకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. కొత్తగా యాసిడ్‌ అటాక్‌ బాధితులకు, మాట సంబంధిత లోపాలు ఉన్న వారికి, అభ్యాస వైకల్యంతో బాధపడేవారికి, ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్స్‌ బాధితులకు, మల్టిబుల్‌ డిజార్డర్స్‌ (ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు) ఉన్నవారికి స్లాట్స్‌ బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు వేల మందికిపైగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు.

30 నుంచి ఎగ్జామినేషన్‌

అర్హులైన దివ్యాంగులు మీసేవ లేదా ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా తమ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఈ నెల 30 నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా వైకల్య శాతం ఎంత ఉన్నదీ నిర్ధారించి డిజిటల్‌ సర్టిఫికెట్‌ జారీచేయనున్నారు. ఈ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారికి నెలవారీ పెన్షన్‌ అందడంతో పాటు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు లభిస్తుంది.


ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు కేటాయింపు

తొలిదశలో 4,886 మందికి అవకాశం

ప్రవేశాలు పొందేందుకు 7వ తేదీ వరకూ గడువు

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు తొలి దశ లాటరీ ప్రక్రియ బుధవారం పూర్తయ్యిందని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జె.చంద్రశేఖరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు జిల్లాలో 8,107 మంది దరఖాస్తు చేసుకోగా, 8,105 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. తొలివిడతలో పాఠశాలలకు ఒక కిలోమీటరులోపు నివాసం ఉంటున్న 4,886 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సమాచారం వస్తుందన్నారు. ఉచిత సీట్లు లభించిన విద్యార్థులు సంబంధిత పాఠశాలలో వచ్చే నెల ఏడో తేదీలోగా ప్రవేశం పొందాలన్నారు. సీట్ల కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను పాఠశాలలో సమర్పించాలన్నారు. ఆయా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని పాఠశాలల యాజమాన్యాలను కూడా ఆదేశించామన్నారు. ప్రవేశాలపై యాజమాన్యాలకు సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈవో/జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రతించాలని ఆయన ఆ ప్రకటనలో సూచించారు.


విశాఖ-బెంగళూరు ప్రత్యేక రైలు క్రమబద్ధీకరణ వాయిదా

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

విశాఖ-ఎస్‌ఎంవీ బెంగళూరు-విశాఖ ప్రత్యేక రైలు క్రమబద్ధీకరణ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సర్వీసులను మరో ఐదు ట్రిప్పులు ప్రత్యేక రైళ్లుగా నడపనున్నట్టు పేర్కొన్నారు. విశాఖ-ఎస్‌ఎంవీ బెంగళూరు (08581) ఏప్రిల్‌ 5 నుంచి మే 3 వరకు, తిరుగు ప్రయాణంలో ఎస్‌ఎంవీ బెంగళూరు-విశాఖ ప్రత్యేక రైలు (08582) ఏప్రిల్‌ 6 నుంచి మే 4 వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ-బెంగళూరు రైలు ఈ నెల 5 నుంచి శాశ్వత ప్రాతిపదికన (వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా) పట్టాలెక్కాల్సి ఉంది. విశాఖ నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం, బెంగళూరు నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం బయలుదేరేలా షెడ్యూల్‌ కూడా రూపొందించారు. అయితే అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.


డీసీఐ ఎండీ, సీఈఓగా కెప్టెన్‌ దివాకర్‌

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కెప్టెన్‌ దివాకర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఐ బోర్డు, నామినేషన్‌ కమిటీ, రెమ్యూనరేషన్‌ కమిటీ ఆమోదంతో ఆయన బాధ్యతలు చేపట్టినట్టు సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివాకర్‌కు డ్రెడ్జింగ్‌ పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉంది. గతంలోను ఆయన ఎండీగా బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - Mar 26 , 2026 | 12:46 AM