‘షుగర్స్’ కార్మికులకు తీపికబురు
ABN , Publish Date - Sep 29 , 2026 | 01:09 AM
జిల్లాలో ఖాయిలాపడిన తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారాల కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.
బకాయిలు చెల్లింపునకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
‘తాండవ’లో 426 మంది కార్మికులు, నలుగురు ఉద్యోగులకు రూ.18.2 కోట్లు
‘ఏటికొప్పాక’లో 406 మంది కార్మికులకు రూ.12.87 కోట్లు
పాయకరావుపేట/ ఎస్.రాయవరం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఖాయిలాపడిన తాండవ, ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారాల కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు, స్వచ్ఛంద విరమణ బకాయిల చెల్లింపుల నిమిత్తం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఫ్యాక్టరీల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో చోడవరం, తుమ్మపాల, ఏటికొప్పాక, పాయకరావుపేట (తాండవ)ల్లో సహకార షుగర్ ఫ్యాక్టరీలు వున్న విషయం తెలిసిందే. వీటిలో మూడు ఫ్యాక్టరీలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూత పడ్డాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని మూసివేసింది. అనంతరం ఖాయిలా పరిశ్రమగా ప్రకటించి లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత 2021-22 సీజన్‌లో ఏటికొప్పాక, తాండవ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తరువాత రెండేళ్లపాటు అధికారంలో వున్నప్పటికీ కార్మికులకు సంబంధించి వివిధ రకాల బకాయిలను చెల్లించలేదు. చెరకు సరఫరా చేసిన రైతులకు సైతం సుమారు ఏడాదిన్నర తరువాత బకాయిలు చెల్లించింది. రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి నడిపించే పరిస్థితి లేదని నిపుణుల కమిటీ నిర్ధారించడంతో కార్మికులకు వివిధ రకాల బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టింది. మూతపడిన చక్కెర కర్మాగారాలపై అధ్యయం చేసేందుకు నియమించిన మంత్రుల కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రంలో ఐదు సహకార చక్కెర కర్మాగారాల ఉద్యోగులు జీతాలు, కార్మికుల వేతనాల బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి చెల్లింపుల కోసం రూ.66.56 కోట్లు మంజూరు చేస్తూ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తాండవ షుగర్స్‌లో 426 మంది కార్మికుల వేతనాల బకాయిలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, నలుగురు పర్మినెంట్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్, ఎక్స్‌గ్రేషియా, ఇతర బకాయిల చెల్లింపునకు రూ.18.2 కోట్లు మంజూరు చేసింది. ఏటికొప్పాక షుగర్స్‌లో 406 మంది కార్మికుల వేతనాల బకాయిలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఎక్స్‌గ్రేషియా, ఇతర బకాయిల చెల్లింపునకు రూ.12.87 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఏపీఐఐసీ రుణం రూపంలో అందజేయనున్నది. ఈ సందర్భంగా తాండవ షుగర్స్ ఇన్‌చార్జి ఎండీ ప్రసాదరావు మాట్లాడుతూ... మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాలు, కార్మికుల వేతనాలు, ఇతర బకాయిలు చెల్లింపునకు పభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అన్ని ప్రక్రియలు పూర్తయి, ఈ ఏడాది డిసెంబరు నాటికి చెల్లింపులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
కార్మికుల్లో హర్షాతిరేకాలు
మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల ఉద్యోగులు, కార్మికుల జీతాలు/ వేతనాల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసిన విషయం తెలుసుకొని ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ శ్రామిక సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు కె.ఎర్రన్నాయుడు, ప్రధాన కార్యదర్శి గుండుబోగుల గోవిందరావు, ముఖ్య కార్యదర్శి అల్లు నరసింహమూర్తి ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని మూసివేయించిందని, కార్మికులకు వేతన బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తమ ఇక్కట్లు తెలుసుకున్న కూటమి ప్రభుత్వం... వేతన బకాయిల చెల్లింపుకు జీవో విడుదల చేయడం సంతోషంగా వుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.