Share News

కూటమికి కలిసొచ్చిన అదృష్టం

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:06 AM

మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక శుక్రవారం నిర్వహించారు.

కూటమికి కలిసొచ్చిన అదృష్టం
లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తున్న అధికారులు

ఎంపీపీగా పంచాడి మంజుల

వైస్‌ ఎంపీపీగా చెల్లమ్మ

లాటరీలో కూటమికి దక్కిన రెండు పదవులు

ఉత్కంఠగా సాగిన ఎన్నిక

డుంబ్రిగుడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి, సహాయ ఎన్నికల జిల్లా అధికారి చంద్రశేఖర్‌ అధ ్యక్షతన ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికను జరిపారు. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ-3, వైసీపీ- 5, స్వతంత్రులు-5, బీజేపీ-1 స్థానం గెలుపొందాయి. గురువారం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. అయితే శుక్రవారం 14 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల జిల్లా అధికారి చంద్రశేఖర్‌ ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. ఎంపీపీగా కండ్రు ఎంపీటీసీ అభ్యర్థిని పంచాడి మంజుల (టీడీపీ)కు అరమ ఎంపీటీసీ సభ్యుడు రామసుందర్‌ ప్రతిపాదించగా.. కించుమండ ఎంపీటీసీ సభ్యురాలు కొర్రా భాను బలపరిచారు. మంజులకు టీడీపీకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరు, ముగ్గురు స్వతంత్రులు మద్దతు పలికారు. వైసీపీ తరుపున ఎంపీపీగా గసభ ఎంపీటీసీ సభ్యుడు చిక్కుడు మల్లేశ్వరరావు (వైసీపీ రెబల్‌)కు సొవ్వా ఎంపీటీసీ సభ్యుడు పాంగి నర్సింగరావు(వైసీపీ) ప్రతిపాదించగా.. కొర్రాయి ఎంపీటీసీ సభ్యుడు కిండంగి లైకోన్‌ బలపరిచారు. మల్లేశ్వరరావుకు వైసీపీకి చెందిన ఐదుగురు, ఇద్దరు స్వతంత్రులు మద్దతు పలికారు. దీంతో ఇరువర్గాలకు ఏడుగురు చొప్పున రావడంతో లాటరీ తీయాలని అధికారులు నిర్ణయించారు. లాటరీలో ఎంపీపీగా కూటమి అభ్యర్థి పంచాడి మంజుల విజయం సాధించారు.

అదేవిధంగా టీడీపీ వైస్‌ ఎంపీపీ అభ్యర్థిగా బస్కిబారి ఎంపీటీసీ సభ్యురాలు చెల్లమ్మకు కితలంగి ఎంపీటీసీ సభ్యుడు కొర్రా నారాయణ ప్రతిపాదించగా.. కండ్రుం ఎంపీటీసీ సభ్యురాలు పంచాడి మంజుల బలపరిచారు. అలాగే వైసీపీ తరపున వైస్‌ ఎంపీపీగా గుంటగన్నెల ఎంపీటీసీ సభ్యుడు దురియా దాసుబాబుకు సోవ్వా ఎంపీటీసీ సభ్యుడు పాంగి నర్సింగరావు ప్రతిపాదించగా గుంటసీమ ఎంపీటీసీ సభ్యురాలు పాంగి కమల బలపరిచారు. ఇరువర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో వైస్‌ ఎంపీపీగా కూటమి మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు బస్కిబారికి చెల్లమ్మ విజయం సాధించారు. ఎంపీపీ మంజుల, వైస్‌ ఎపీఈపీ చెల్లమ్మలను ఎంపీటీసీ సభ్యులు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు అభినందించారు. మండల ఆర్వో రహిం,గెన్ను, ఎంపీడీఓ విశ్వనాథ్‌, ఎంఆర్‌ఓ శంకరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:06 AM