Share News

కొరమీను పెంపకంతో భలే ఆదాయం

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:20 AM

కొరమీను చేపల పెంపకం ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత సాధించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

కొరమీను పెంపకంతో భలే ఆదాయం

డ్వాక్రా సంఘాలకు సబ్సిడీపై రుణాలు

ఒక్కో యూనిట్‌ విలువ రూ.4.41 లక్షలు

పీఎంఈజీపీ కింద 35 శాతం ప్రభుత్వం రాయితీ

మిగిలిన సొమ్ము బ్యాంకు నుంచి రుణం

పిలలు వదిలిన ఎనిమిది నెలలకే చేపల పట్టుబడి

మూడేళ్లలో పెట్టుబడితోసహా మొత్తం రికవరీ

నర్సీపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

కొరమీను చేపల పెంపకం ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత సాధించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పీఎంఈజీపీ పథకం కింద గ్రామాల్లో కొరమీను చేపల పెంపకానికి యూనిట్లు మంజూరు చేస్తున్నది. ఇందుకు అవసరమైన పెట్టుబడిలో 35 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సొమ్మును బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తున్నాయి.

కొరమీను చేపల్లో పోషకాలు అధికంగా ఉండడంతోపాటు మంచి రుచికరంగా ఉండడంతో మార్కెట్లో అధిక ధర పలుకుతున్నది. సైజునుబట్టి కిలో రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. పిల్లలను నీటిలో వదిలిన ఎనిమిది నెలల్లోనే పట్టుబడికి వస్తుండడంతో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందే అవకాశం వుంది. డ్వాక్రా మహిళలతో కొరమీను చేపల పెంపకం చేయించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) నిర్ణయించింది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ (పీఎంఈజీపీ) కింద సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయిస్తున్నది. ఇప్పటికే నాతవరం మండలంలో ఐదు కొరమీను చేపల యూనిట్లు మంజూరు చేశారు. ఒక్కొక్క యూనిట్‌ వ్యయం రూ.4.41 లక్షలు. ఇందులో షెడ్డు నిర్మాణం, పీవీసీ ట్యాంకు, ఇందులో అమర్చే ఇతర సామగ్రి, బోరు, మోటారు, చేప పిల్లలకు ఏడాదిపాటు దాణా ఖర్చు వంటివి వుంటాయి. మొత్తం యూనిట్‌ వ్యయంలో ప్రభుత్వం 35 శాతం భరిస్తుంది. మిగిలిన సొమ్ము బ్యాంకుల నుంచి రుణంగా పొందాలి.

ఒక యూనిట్‌ ఏర్పాటు చేయడానికి కనీసం 10 సెంట్ల స్థలం అవసరం. లబ్ధిదారులు బోరు తవ్వించుకొని కరెంటు మోటారు అమర్చు కోవాలి. స్థలంలో 18గీ16 విస్తీర్ణంలో షెడ్డు నిర్మాణం చేసి 25 వేల లీటర్ల పీవీసీ ట్యాంకు ఏర్పాటు చేస్తారు. నీటిని ట్యాంకులోకి నింపడానికి, బయటకు పంపడానికి అవసరమైన పైపులు, ఆక్సిజన్‌ కోసం మోటారు అమర్చుతారు. ఒక్కొక్కటి 10-20 గ్రాముల బరువు ఉన్న 1,000 చేప పిల్లలు రూ.15వేలుకి సరఫరా చేస్తారు. దాణా కోసం రూ.1.12 లక్షల అవుతుంది. చేప పిల్లలను ట్యాంకులో వేసిన తరువాత రోజు ఉదయాన్నే ట్యాంకులోని నీటిని మారుస్తుండాలి. నాలుగు నెలలకు ఒక్కో చేప బరువు 400 నుంచి 500 గ్రాముల వరకు పెరుగుతుంది. అనంతరం వీటిని 25గీ25గీ6 అడుగుల గొయ్యి తవ్వించి అందులోకి మార్చుకోవాలి. పీవీసీ ట్యాంకులో మరో వెయ్యి చేప పిల్లలు వేసుకోవాలి. మొదటి పంట చేతికి వచ్చే సరికి ఎనిమిది నెలలు పడుతుంది. అప్పటికి ఒక్కో చేప కిలో వరకు బరువు పెరుగుతుంది. హోల్‌సేల్‌ వ్యాపారులు కొరమీను చేపలను కిలో రూ.300కు కొనుగోలు చేస్తున్నారు. చేప పిల్లలు, దాణా ఖర్చులు పోను రైతుకి ఒక పంట మీద రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో దాణా, చేప పిల్లలు, కరెంటు ఖర్చులుపోను రూ.1.2 లక్షల వరకు మిగులుతాయి. నాలుగు నెలలకు ఒక బ్యాచ్‌ చొప్పున చేపల పెంపకం చేపడితే రూ.3.5 లక్షల వరకు లాభం వస్తుంది. ఇందులో కొంతసొమ్ముతో బ్యాంకు రుణం తీర్చేస్తే.. మిగిలిన సొమ్ము కుటుంబ ఖర్చులకు వాడుకోవచ్చు. రెండు, మూడేళ్లలోనే బ్యాంకు రుణం తీరిపోయి, వచ్చే ఆదాయం అంతా లబ్ధిదారులకే చెందుతుంది.


టిప్పర్‌ లారీ ఢీకొని పారిశుధ్య కార్మికుడి మృతి

మాడుగుల రూరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో డి.సురవరం- ఘాట్‌రోడ్డు జంక్షన్‌ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.

సాగరం పంచాయతీ డి.సురవరం గ్రామానికి చెందిన బసంత్‌ కుమారస్వామి (42) పంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డి.సురవరం నుంచి ఘాట్‌రోడ్డు జంక్షన్‌కి నడుచుకుంటూ వస్తుండగా, ఎదురుగా క్రషర్‌బుగ్గి లోడుతో వస్తున్న టిప్పర్‌ లారీ బలంగా ఢీకొన్నది. దీంతో కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారమిచ్చారు. కొద్దిసేపటికీ అంబులెన్స్‌ రావడంతో మాడుగుల సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే తీవ్రరక్తస్రావం అయ్యింది. ప్రథమ చికిత్స అనంతరం మేరుగైన వద్యూం కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. టిప్పర్‌ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదపై తమకు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.


కూరగాయల ధరలు పతనం

గత వారంతో పోలిస్తే 50 శాతం తగ్గుదల

దేవరాపల్లి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌కు ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు పలు రకాల కూరగాయాలు తీసుకువచ్చి విక్రయించారు. గత వారంతో పోలిస్తే కూరగాయలు ఎక్కువ వచ్చాయి. మరోవైపు శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో దేవరాపల్లి మార్కెట్‌కు వ్యాపారులు తక్కువ మంది వచ్చారు. దీంతో గత వారంతో పోలిస్తే దాదాపు అన్ని కూరగాయల ధరలు సగానికి పడిపోయాయి. బెండ క్రేటు (సుమారు 12 కిలోలు) రూ.150 మాత్రమే పలికింది. గత వారం ఇదే క్రేటు బెండకాయలు రూ.350 నుంచి రూ.400లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. నల్ల వంకాయలు క్రేటు ( సుమారు 15 కిలోలు) గత వారం రూ.500కాగా ఈ వారం రూ.250కి తగ్గాయి. తెల్ల వంకాయలు క్రేటు (13 కిలోలు) రూ.100 నుంచి రూ.150 మధ్య పలికాయి. బీరకాయల ధర యథావిధిగా కొనసాగింది. 20 కిలోలు రూ.800లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. సోమవారం మార్కెట్‌కు సెలవు కావడంతో తెచ్చిన కూరగాయలను తిరిగి వెనక్కు తీసుకెళ్లలేక, వ్యాపారులు చెప్పిన ధరలకు అమ్ముకోవాల్సి వచ్చిందని పలువురు రైతులు వాపోయారు.

Updated Date - Jun 22 , 2026 | 01:20 AM