Share News

అన్న క్యాంటీన్‌తో పేదలకు మంచి భోజనం

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:09 AM

పేదలకు మంచి భోజనం అందించడమే అన్న క్యాంటీన్‌ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం పాయకరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో రూ.61 లక్షలతో ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేశారు.

అన్న క్యాంటీన్‌తో పేదలకు మంచి భోజనం
అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం భోజనం చేస్తున్న హోం మంత్రి అనిత

- హోం మంత్రి అనిత

- ‘పేట’లో అన్న క్యాంటీన్‌ ప్రారంభం

పాయకరావుపేట, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పేదలకు మంచి భోజనం అందించడమే అన్న క్యాంటీన్‌ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం పాయకరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో రూ.61 లక్షలతో ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ మండలాల్లో కూడా వీటిని విస్తరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పాయకరావుపేటలో క్యాంటీన్‌ను ఏర్పాటుచేశామని, రానున్న రోజుల్లో నక్కపల్లి, అడ్డరోడ్డు సమీపంలో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు అన్న క్యాంటీన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి దాని పక్కనే ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.లవరాజు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పెదిరెడ్డి చిట్టిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేశ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు చించెలపు ప్రదీప్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు యాళ్ళ వరహాలబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్‌ పల్లా విలియంకేరి, నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్‌, లాలం కాశీనాయుడు, బొంది కాశీవిశ్వనాథం, ఆచంట దొర, నారపురెడ్డి పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 01:09 AM