Share News

మత్స్య శాఖకు మంచి రోజులు

ABN , Publish Date - May 05 , 2026 | 12:59 AM

మత్స్యశాఖ ఆధ్వర్యంలో గతంలో ఒక వెలుగు వెలిగిన చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం కేంద్రానికి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. సుమారు పదేళ్ల నుంచి నిర్వీర్యంగా పడివున్న ఈ కేంద్రం ఆధునికీకరణకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులతో చేప పిల్లల పెంపకం కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు కలెక్టర్‌ ఇటీవల ప్రకటించారు.

మత్స్య శాఖకు మంచి రోజులు
చెత్తాచెదారం పేరుకుపోయిన చేప పిల్లల పెంపకం తొట్టెలు

నర్సీపట్నంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఆధునికీకరణకు కలెక్టర్‌ చొరవ

రూ.1.99 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి

నర్సీపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి): మత్స్యశాఖ ఆధ్వర్యంలో గతంలో ఒక వెలుగు వెలిగిన చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం కేంద్రానికి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. సుమారు పదేళ్ల నుంచి నిర్వీర్యంగా పడివున్న ఈ కేంద్రం ఆధునికీకరణకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులతో చేప పిల్లల పెంపకం కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు కలెక్టర్‌ ఇటీవల ప్రకటించారు.

నర్సీపట్నం మత్స్య శాఖ ఏడీ కార్యాలయం ఆవరణలో చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. మొత్తం 23 తొట్టెల్లో చేప పిల్లలను ఉత్పతి చేసేవారు. వీటిని జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో వదిలేవారు. అయితే ఈ కేంద్రం రహదారికన్నా తక్కువ ఎత్తులో వుండడంతో డ్రైనేజీ కాలువ నీరు తొట్టెల్లోకి చేరుతున్నది. చేప పిల్లలను పెంచే కుండీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి అధ్వానంగా తయారైంది. దీంతో పదేళ్ల నుంచి చేప పిల్లల ఉత్పత్తిని ఆపేశారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఇటీవల నర్సీపట్నంలో పర్యటించారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. జలవనరు శాఖ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో అంచనాలు తయారు చేయించారు. సుమారు రెండు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మత్స్యశాఖ అధికారులకు నివేదిక అందజేశారు. గత శుక్రవారం నర్సీపట్నం పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌.. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సీఎస్‌ఆర్‌ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వున్న 23 తొట్టెలను ఎత్తు చేయడంతోపాటు కొత్తగా మరో పది తొట్టెలు నిర్యిస్తారు. కార్యాలయం ఆవరణకు ప్రహారీ గోడ నిర్మించి, నీటి కోసం రెండు బోర్లు వేస్తారు.

ఈ సమస్యలు కూడా పరిష్కరించాలి...

కాగా నర్సీపట్నం మత్స్యశాఖ ఏడీ కార్యాలయ భవనం శిథిలావస్థలో ఉంది. కిటికీల రెక్కలు ఊడి పోయాయి. భవనం శ్లాబ్‌ నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. ఇంకా కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత జిల్లా మత్స్యశాఖ అధికారి పోస్టును మంజూరు చేశారు. కానీ ఇంతవరకు భర్తీ చేయలేదు. ఇక్కడ ఏడీగా పని చేస్తున్న వియజ.. జిల్లా మత్స్య శాఖ అధికారిగా అనకాపల్లిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎఫ్‌డీవో పోస్టులు ఐదింటికి రెండు ఖాళీగా ఉన్నాయి. ఫిషర్‌మెన్‌ పోస్టులు రెండు, సీనియర్‌ అసిస్టెంట్‌ ఒకటి, వాచ్‌మెన్‌ పోస్టులు నాలుగు, టైపిస్ట్‌ పోస్టు ఒకటి ఖాళీగా వున్నాయి. నూతన భవనం నిర్మించడంతోపాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం వుంది.

Updated Date - May 05 , 2026 | 12:59 AM