ఎత్తిపోతల పథకాలకు మంచిరోజులు
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:26 PM
మన్యంలో ఎత్తిపోతల పథకాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ పాలనలో మోక్షం కలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఆయా పథకాలకు మరమ్మతులు చేపట్టి, రానున్న పదేళ్ల పాటు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏజెన్సీ వ్యాప్తంగా 22..
వాటికి మరమ్మతులు చేపట్టి సాగునీరందించేందుకు సర్కారు నిర్ణయం
రెండు దశాబ్దాల తర్వాత మోక్షం కలిగే అవకాశం
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
మన్యంలో ఎత్తిపోతల పథకాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ పాలనలో మోక్షం కలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఆయా పథకాలకు మరమ్మతులు చేపట్టి, రానున్న పదేళ్ల పాటు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జలవనరుల శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గత కొన్నాళ్లుగా వినియోగానికి దూరంగా ఉన్న ఆయా ఎత్తిపోతల పథకాల స్థితిగతులను పరిశీలించి, వాటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మైనర్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులకు ప్రభుత్వం సూచించింది. దీంతో రానున్న రోజుల్లో మన్యంలోని ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలిగే పరిస్థితి ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
సుదీర్ఘకాలంగా ఏపీఎంఐడీసీ సేవలు దూరం
ఏజెన్సీలో పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, చింతపల్లి మండలాల్లో 1996లో 22 వరకు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు వాటి పనితీరు బాగుంది. కానీ క్రమంగా గిరి రైతులు వాటిపై ఆసక్తి చూపకపోవడంతో పాటు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. అలాగే చాలా ఏళ్ల క్రితమే ఏజెన్సీ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ మైనర్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఐడీసీ) సేవలు దూరమయ్యాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం విశాఖపట్నంలో, డీఈఈ కార్యాలయం పాడేరులో ఉండేవి. అప్పట్లో ఇంజనీర్లు అప్పుడప్పుడు గిరిజన ప్రాంతానికి వచ్చి ఒకటి, అర పథకాలను వినియోగంలోకి తీసుకువచ్చేవారు. దీంతో అప్పట్లో హుకుంపేట మండలం అడ్డుమండ, దిగుడుపుట్టు, పాడేరు మండలం ఉబ్బేటిపుట్టు, సేరిబయలు, రాయిగెడ్డ ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసేవి. అయితే విశాఖపట్నంలో ఉన్న ఏపీఎంఐడీసీ కార్యాలయాన్ని శ్రీకాకుళం తరలించడంతో ఏజెన్సీలోని ఎత్తిపోతల పథకాల బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఆ తరువాత దానిని విజయనగరానికి మార్చారు. ప్రస్తుతం ఏజెన్సీలోని ఎత్తిపోతల పథకాలు విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ మైనర్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయం పరిధిలోకి వస్తున్నాయి.
రైతుల అవగాహన లేమి... ఆపై అధికారుల నిర్లక్ష్యం
ఏజెన్సీలో వర్షాధారంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు పండించుకునే అలవాటు ఉండడంతో గిరిజనులు ఎత్తిపోతలపై ఆసక్తి కనబరచని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఒక ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్న ఆయకట్టు రైతులంతా ఒక కమిటీగా ఏర్పడి, వారి ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించుకోవాలి. అలాగే విద్యుత్ బిల్లులు, స్వల్ప మరమ్మతులు సైతం రైతులు భరించాల్సి ఉంటుంది. ఈ కారణంగా గిరిజన రైతులు ఏజెన్సీలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణపై శ్రద్ధపెట్టని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో పథకాలు మూలకు చేరాయి. ఇదే అదనుగా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లు, పైపులు వంటివి చోరీకి గురయ్యాయి. దీంతో పూర్తిగా పథకాలు పడకేశాయి. ఏజెన్సీలో వివిధ పరిస్థితుల్లో నిరుపయోగంగా ఉన్న పథకాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. ప్రధాన సమస్యలైన విద్యుత్ బిల్లులు, పథకం నిర్వహణపై కనీసం దృష్టి పెట్టకుండా, అప్పుడప్పుడు వాటి మరమ్మతులకు నిధులు కేటాయించి, తూతూమంత్రంగా మరమ్మతులు చేసి మిన్నకుండడంతో ఫలితం లేకుండాపోయింది. దీంతో సుమారు రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలో ఒక్క ఎత్తిపోతల పథకం ద్వారా కూడా గిరి రైతులకు సాగునీరు అందలేదు. గతంలో కొన్ని పథకాలకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయని అధికారులు ప్రకటించినప్పటికీ, వాటి తాజా స్థితిగతులపై స్పష్టత లేని పరిస్థితి కొనసాగుతున్నది. ఈ తరుణంలో వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.