గోల్‌మాల్!
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:14 AM
నగరంలో ఓ భారీ షాపింగ్‌మాల్ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ వ్యవహారం జీవీఎంసీలో కలకలం రేపుతోంది. ఓసీకి సంస్థ దరఖాస్తు చేయగా, మాల్‌ను పరిశీలించేందుకు వెళ్లిన టౌన్‌ప్లానింగ్ అధికారి ఒకరు కొన్ని లొసుగులు ఉన్నాయంటూ తిరస్కరించారు. దీంతో సదరు అధికారిని వెంటనే ఆ జోన్ నుంచి తప్పించి, తర్వాత టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయానికి సరండర్ చేశారు. ఆ మాల్‌కు ఓసీ జారీకి భారీగా చేతులు మారడం వల్లనే అడ్డుగా మారిన అధికారిని ఆగమేఘాల మీద తప్పించేస్తారని జీవీఎంసీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొత్తగా నిర్మించిన భవనానికి
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం షాపింగ్‌మాల్ యాజమాన్యం దరఖాస్తు
లొసుగులు ఉన్నాయంటూ
తిరస్కరించిన జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారి
సదరు అధికారిని
ఆ జోన్ బాధ్యతల తప్పించిన వైనం
తర్వాత డైరెక్టర్ కార్యాలయానికి సరండర్
ఓసీ జారీకి భారీగా చేతులు మారినట్టు ప్రచారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ఓ భారీ షాపింగ్‌మాల్ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ వ్యవహారం జీవీఎంసీలో కలకలం రేపుతోంది. ఓసీకి సంస్థ దరఖాస్తు చేయగా, మాల్‌ను పరిశీలించేందుకు వెళ్లిన టౌన్‌ప్లానింగ్ అధికారి ఒకరు కొన్ని లొసుగులు ఉన్నాయంటూ తిరస్కరించారు. దీంతో సదరు అధికారిని వెంటనే ఆ జోన్ నుంచి తప్పించి, తర్వాత టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయానికి సరండర్ చేశారు. ఆ మాల్‌కు ఓసీ జారీకి భారీగా చేతులు మారడం వల్లనే అడ్డుగా మారిన అధికారిని ఆగమేఘాల మీద తప్పించేస్తారని జీవీఎంసీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నగరంలో జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఒక వాణిజ్య సంస్థ భారీషాపింగ్‌మాల్ నిర్మించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి భూమిని లీజుకు తీసుకుంది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తవడంతో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం జీవీఎంసీకి సంబంధిత సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఓసీ జారీ అయితే ప్లాన్ జారీ సమయంలో జీవీఎంసీకి మార్టిగేజ్ చేసిన పది శాతం ప్లింత్ ఏరియా విడుదలవుతుంది. అప్పుడే ఆ స్థలాన్ని వేరెవరికైనా అద్దె/లీజుకు ఇవ్వడానికి భవన నిర్మాణ సంస్థకు అధికారం దక్కుతుంది. లేనిపక్షంలో ఆ స్థలం జీవీఎంసీ ఆధీనంలోనే ఉండిపోతుంది. ఓసీ కోసం మాల్ నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసుకోవడంతో టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారి భవన నిర్మాణం, డాక్యుమెంట్‌లను తనిఖీ చేసేందుకు వెళ్లారు. షాపింగ్‌మాల్‌కు తూర్పు వైపున 30 అడుగుల రోడ్డు ఉన్నట్టు డాక్యుమెంట్‌లో జీవీఎంసీకి చూపించారని, కానీ ప్లాన్‌లోగానీ, గ్రౌండ్‌లోగానీ రోడ్డు లేదని గుర్తించారు. అలాగే భవన నిర్మాణానికి ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్మాణం చేపట్టే స్థలంలో పది శాతం భూమిని జీవీఎంసీకి ఓపెన్‌స్పేస్‌గా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఆ విధంగా జరగలేదని సదరు అధికారి పరిశీలనలో గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఓసీ జారీచేయడం సాధ్యం కాదని, సవరణలను పూర్తిచేసిన తర్వాత తిరిగి దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని పేర్కొంటూ దరఖాస్తును సదరు అధికారి తిరస్కరించినట్టు సమాచారం. అయితే అప్పటికే ఓసీ జారీకి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు జీవీఎంసీలోని ఒక అధికారితోపాటు మునిసిపల్ శాఖలోని కొందరు అధికారులను మాట్లాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాంటి తరుణంలో ఓసీ దరఖాస్తును టౌన్‌ప్లానింగ్ అధికారి తిరస్కరించడంతో వారికి మింగుడు పడలేదని, అందువల్లనే సదరు అధికారిని ముందుగా ఆ జోన్ బాధ్యతల నుంచి తప్పించి తర్వాత రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ కార్యాలయానికి సరండర్ చేసినట్టు జీవీఎంసీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.