Share News

బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:38 PM

వివిధ శాఖల సమన్వయంతో బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి ఆదేశించారు.

బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు
మాట్లాడుతున్న రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి

రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి

వెయ్యి రోజుల బాలల ఆరోగ్యంపై దృష్టి సారించండి

పాడేరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

వివిధ శాఖల సమన్వయంతో బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమానికి అమలవుతున్న కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా మూడేళ్ల బాలలు (వెయ్యి రోజులు) అత్యంత కీలకమన్నారు. బాలల తొలి వెయ్యి రోజుల ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ విషయంపై అంగన్‌వాడీ సిబ్బందికి నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేక ఇబ్బందులున్నప్పటికీ వాటిని అధిగమిస్తే చక్కని ఫలితాలు సాధించవచ్చున్నారు. ప్రధానంగా సీడీపీవోలు తరచూ క్షేత్ర పర్యటనలు చేయాలని, క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యలను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతులు, గర్భిణులకు అందుతున్న పోషకాహారం, వైద్య సేవలు సకాలంలో అందేలా పర్యవేక్షించాలని, బాలల తొలి వెయ్యి రోజులు, తల్లిపాలు, శిశు సంరక్షణపై ఆయా కుటుంబాలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. కిశోర బాలికల్లో పోషకాహార లోపాలు, బాల్యంలోనే గర్భధారణతో ఏర్పడే సమస్యలు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఈసందర్భంగా జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి వివరించారు. అనంతరం పోహకారంపై అవగాహనకు రూపొందించిన పోస్టర్‌ను అందరూ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, యునిసెఫ్‌ పోషకాహాకార నిపుణులు ఖ్యాతి, సమన్వయకర్త రేషా దేశాయ్‌, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీభాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:38 PM