దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు..
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:46 PM
ఎన్‌ఆర్ పురంలోని వైకుంఠగిరి దర్శనానికి వెళుతూ మండలంలోని అరకు- విశాఖ ప్రధాన రహదారి వెంకయ్యపాలెం మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అనంతగిరి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఆర్ పురంలోని వైకుంఠగిరి దర్శనానికి వెళుతూ మండలంలోని అరకు- విశాఖ ప్రధాన రహదారి వెంకయ్యపాలెం మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విశాఖపట్నం కొమ్మాది టీచర్స్ కాలనీకి చెందిన చిన్నగూడబ మణికంఠ(29) ద్విచక్ర వాహనంపై ఎన్‌ఆర్ పురంలోని వైకుంఠగిరి దర్శనానికి ఉదయం బయలుదేరాడు. అయితే వెంకయ్యపాలెం మలుపు వద్దకు వచ్చేసరికి అరకు వైపు నుంచి వస్తున్న మినీ వ్యాన్ బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అనంతగిరి ఎస్‌ఐ కె.శంకరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎస్.కోట ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మణికంఠ బీటెక్ పూర్తి చేసి ఇంటీరియర్ పనులు చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.