Share News

మరో ఏడాదిలో గోదావరి జలాలు

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:07 AM

జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి, కశింకోట మండలాల్లో ఎడమ ప్రధాన కాలువలో వివిధ రకాల పనులను ముమ్మరం చేశారు.

మరో ఏడాదిలో గోదావరి జలాలు
పాయకరావుపేట వద్ద కాలువ ఏర్పాటుకు కొండను తొలుస్తున్న యంత్రాలు

శరవేగంగా పోలవరం ఎడమ కాలువ పనులు

చివరి దశకు చేరిన దార్లపూడి అక్విడక్టు నిర్మాణం

పాయకరావుపేట వద్ద కొండను తొలచి కాలువ ఏర్పాటు

వచ్చే ఏడాది మార్చినాటికి అనకాపల్లికి పోలవరం నీరందిస్తామని తాజాగా సీఎం చంద్రబాబు వెల్లడి

తొలివిడత లక్షన్నర ఎకరాలకు సాగు నీరు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి, కశింకోట మండలాల్లో ఎడమ ప్రధాన కాలువలో వివిధ రకాల పనులను ముమ్మరం చేశారు.

పోలవరం ఎడమ కాలువ పనులను జిల్లాలో మూడు ప్యాకేజీలుగా (ఆరు, ఏడు, ఎనిమిది) చేపట్టగా... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఆరో ప్యాకేజీలో 70 శాతం పనులు, ఏడో ప్యాకేజీలో 75 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎనిమిదో ప్యాకేజీ పనులు ప్రారంభం కాలేదు. ఆరో ప్యాకేజీలో పాయకరావుపేట పట్టణం తాండవ షుగర్స్‌ సమీపంలో మొదలై ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద ముగుస్తుంది. 24 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం/సిమెంట్‌ లైనింగ్‌, 22 వంతెనలు, 13 అండర్‌ టన్నెళ్లు (యూటీ), 34 సూపర్‌ పాసేజ్‌ (ఎస్‌పీ)లు, 14 ఓవర్‌ టన్నెళ్లు (ఓటీ/స్లూయిస్‌లు), రెండు క్రాస్‌ రెగ్యులేటర్లు, రెండు ఎస్‌పీ, ఎస్‌ఎల్‌బీ పనులు కలిపి 87 నిర్మాణాలు చేపట్టాలి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి పనుల్లో పెద్దగా పురోగతి లేదు. ఆ తరువాత పనులు ఊపందుకొన్నాయి. 2019 జనవరినాటికి 70 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పనులన్నీ ఆగిపోయాయి. ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, తరువాత వాటిని విడుదల చేయకపోవడం ఆనవాయితీగా మారింది. ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎలమంచిలి మండలం ఏటికొప్పాక వద్ద నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు 7వ ప్యాకేజీ పనులు గత టీడీపీ హయాంలో 75 శాతం మేర జరిగాయి. వైసీపీ హయాంలో ఈ ప్యాకేజీలో కొద్ది నెలలపాటు అరకొరగా పనులు జరిగాయి. మొత్తం మీద పది శాతానికి మించి జరగలేదు.

కూటమి వచ్చిన తరువాతే కదలిక

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు జల వనరుల శాఖ కార్యాచరణ చేపట్టింది. పాత టెండర్ల అగ్రిమెంట్ల గడువు పూర్తికావడంతో వాటిని రద్దుచేసి, మిగిలిన పనులకు అధికారులు గత ఏడాది మళ్లీ టెండర్లు పిలిచారు. మొత్తం ఎనిమిది ప్యాకేజీలకు రూ.3,198 కోట్ల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో అనకాపల్లి జిల్లాలోని ఆరో ప్యాకేజీలో రూ.126.18 కోట్ల పనులను మధుకాన్‌-సినో హైడ్రోకు, రూ.331.73 కోట్ల విలువైన పనులు బీఎ్‌సఆర్‌కు అప్పగించింది. ఏడో ప్యాకేజీ- రూ.330.73 కోట్ల విలువైన పనులు కేసీఎల్‌-జేసీసీజీ జాయింట్‌ వెంచర్‌కు, రూ.58.112 కోట్ల విలువైన పనులు ఐవీఆర్‌సీఎల్‌-స్యూకు, రూ.58.112 కోట్ల పనులను ఏసీఎల్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇక ఎమిదో ప్యాకేజీలో పనులను ఆర్‌కేఎన్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించింది. ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా పాయకరావుపేట సమీపంలో వున్న దుర్గానగర్‌ కొండను తొలుస్తున్నారు. ఆరో ప్యాకేజీలో ఇతరచోట్ల కాలువ తవ్వకం, సిమెంట్‌ లైనింగ్‌ పనులు, ఎస్‌.రాయవరం మండలంలో దార్లపూడి వద్ద వరహా నదిపై అక్విడక్టు పనులు తుది దశకు చేరాయి. ఏడో ప్యాకేజీలో తాళ్లపాలెం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేరు కాలువ తవ్వకం పనులు ఊపందుకున్నాయి. ఆయా కంపెనీలు తమకు కేటాయించిన పనులను శరవేగంగా సాగిస్తున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో కూడా ఎడమ కాలువ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చినాటికి పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2027 ఖరీఫ్‌నాటికి జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

Updated Date - Feb 07 , 2026 | 01:07 AM