విశాఖకు గోదారి
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:42 AM
తాగునీటి కోసం అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం లభించబోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాలోకి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేయనున్నారు. అందులో సుమారు 250 క్యూసెక్కుల నీరు నగరానికి రానుండడంతో తాగునీటితోపాటు పరిశ్రమల అవసరాలను తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా
గోదావరి జలాలు నేడు అనకాపల్లి జిల్లాలోకి విడుదల
పాయకరావుపేట వద్ద సీఎం జలహారతి
తాళ్లపాలెం వద్ద నుంచి 250 క్యూసెక్కుల నీరు
ఏలేరు కాలువ ద్వారా కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సరఫరా
గాజువాక పరిసర ప్రాంతాల్లో తీరనున్న నీటి సమస్య
వచ్చే ఏడాది జనవరి నాటికి కేబీఆర్ నుంచి
మేహాద్రిగెడ్డకు పంపింగ్
అక్కడి నుంచి మధురవాడ ప్రాంతానికి నీరు సరఫరా
నగరంలో తాగునీటి కష్టాలు తీరతాయని
జీవీఎంసీ అధికారుల ఆశాభావం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తాగునీటి కోసం అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం లభించబోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాలోకి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేయనున్నారు. అందులో సుమారు 250 క్యూసెక్కుల నీరు నగరానికి రానుండడంతో తాగునీటితోపాటు పరిశ్రమల అవసరాలను తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో గల 23 లక్షల మంది జనాభా తాగునీటి అవసరాలతోపాటు స్టీల్‌ప్లాంటు, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, ఏపీఐఐసీ, పోర్టు వంటి వాటి అవసరాలకు ప్రతిరోజూ 150 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీలు) నీరు అవసరమవుతుంది. అందులో ఏలేరు రిజర్వాయర్ నుంచి ప్రతిరోజూ 110 ఎంజీడీల వరకు నీటిని కాలువ ద్వారా గాజువాకలోని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కేబీఆర్)కు తీసుకువస్తున్నారు. కేబీఆర్‌కు చేరిన నీటిలో పరిశ్రమలకు 50 ఎంజీడీలు కేటాయించగా, మిగిలిన 55 నుంచి 60 ఎంజీడీల నీటిని గాజువాక, అగనంపూడి, మల్కాపురంతోపాటు నగరంలోని అత్యధిక ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. అలాగే తాటిపూడి, రైవాడ, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి రిజర్వాయర్ల నుంచి మరో 40 ఎంజీడీల నీటిని తీసుకుని పెందుర్తి, సింహాచలం, ఆరిలోవ, మధురవాడ వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే నగర ప్రజల అవసరాలను తీర్చేందుకు అవసరమైనంత నీరు రిజర్వాయర్ల నుంచి లభ్యం కాకపోవడంతో నిత్యం సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో గోదావరిలోని మిగులు జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా తీసుకువస్తే తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు,తాగు, విశాఖ వాసుల తాగునీటి అవసరాలు తీర్చవచ్చునని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి నది నుంచి నీటిని పురుషోత్తపట్నం వద్ద పోలవరం ఎడమ కాలువలోకి మోటార్లతో పంపింగ్ చేసి అక్కడి నుంచి పాయకరావుపేట, అనకాపల్లి మీదుగా విశాఖ నగరానికి తరలించేందుకు పనులు చేపట్టారు. పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు ఎడమ కాలువ పనులు పూర్తికావడంతో బుధవారం సీఎం అనకాపల్లి జిల్లా మీదుగా నగరానికి నీటిని విడుదల చేస్తున్నారు.
తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలోకి నీరు మల్లింపు
పురుషోత్తపట్నం లిఫ్ట్ నుంచి వచ్చే గోదావరి జలాలను పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు కొత్తగా నిర్మించిన పోలవరం ఎడమ కాలువ ద్వారా తాండవ, వరహా, శారదా నదుల్లోకి విడుదల చేస్తారు. సుమారు 250 క్యూసెక్కుల నీటిని తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో వదులుతారు. ఏలేరు కాలువ ద్వారా నీరు కేబీఆర్‌కు చేరుతుంది. కేబీఆర్‌కు ప్రస్తుతం ఏలేరు కాలువ ద్వారా 110 ఎంజీడీలు వరకు వస్తుండగా, పోలవరం ఎడమ కాలువ ద్వారా అదనంగా పది ఎంజీడీలు నీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదనంగా వచ్చే నీటితో గాజువాక, అగనంపూడి ప్రాంతాల్లో నీటి కొరతను పూడ్చాలని అధికారులు భావిస్తున్నారు. గాజువాక ప్రాంతానికి నీటి సరఫరా కోసం సుందరయ్య కాలనీ వద్ద పది ఎంజీడీల సామర్థ్యం కలిగిన ట్రీట్‌మెంట్ ప్లాంటు ఉన్నప్పటికీ కొరత కారణంగా ప్రస్తుతం ఆరు ఎంజీడీలు మాత్రమే ఇస్తున్నారు. ఇకపై పది ఎంజీడీలు ఇచ్చేందుకు అవకాశం కలుగుతుంది. అలాగే అగనంపూడి ప్రాంతానికి కూడా అదనంగా నాలుగు ఎంజీడీల నీటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు చెబుతున్నారు.
నేడు సీఎం రాక
పాయకరావుపేట వద్ద
పోలవరం ఎడమ కాలువకు జలహారతి
పాయకరావుపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి విడుదల చేస్తారు. ఈ సందర్భంగా జలహారతి ఇస్తారు. అనంతరం పీఎల్ పురం వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అధికారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.20 గంటలకు పాయకరావుపేట మండలం పీఎం పురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2.30 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 2.45 గంటలకు తాండవ షుగర్ ఫ్యాక్టరీ వెనుకవైపు పోలవరం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ వద్దకు చేరుకుంటారు. కాలువ రెగ్యులేటింగ్ గేట్లను ఎత్తి అనకాపల్లి జిల్లాకు నీటిని విడుదల చేస్తారు. అనంతరం జలహారతి ఇస్తారు. 3.15 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు పీఎల్ పురం బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత 5.25 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని 5.35 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లి నివాసానికి బయలుదేరతారు. పాయకరావుపేట వద్ద నీటి విడుదల, జలహారతితోపాటు పీఎల్ పురం వద్ద జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం హోం మంత్రి వంగలపూడి అనిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పరిశీలించారు.