గోదావరి గలగల.. ఉత్తరాంధ్ర కళకళ
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:27 AM
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వస్తున్న పెట్టుబడులు, ఏర్పాటవుతున్న పరిశ్రమలతోపాటు ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ నుంచి వస్తున్న గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగి, ఇక్కడి నుంచి వలసలకు అడ్డుకట్ట పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
ఇప్పటికే భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు
ఇప్పుడు గోదావరి జలాల రాకతో అభివృద్ధి మరింత వేగవంతం
ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు...భవిష్యత్తులో ఇక్కడికే వలస వస్తారు
సమృద్ధిగా నీరుంటేనే పరిశ్రమలు వస్తాయి
పోలవరం నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం
అభివృద్ధికి కేంద్రాలుగా విశాఖ, అనకాపల్లి జిల్లాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
పోలవరం ఎడమ కాలువ నుంచి ‘పేట వద్ద అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు విడుదల
విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వస్తున్న పెట్టుబడులు, ఏర్పాటవుతున్న పరిశ్రమలతోపాటు ఇప్పుడు పోలవరం ఎడమ కాలువ నుంచి వస్తున్న గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగి, ఇక్కడి నుంచి వలసలకు అడ్డుకట్ట పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి క్రాస్ రెగ్యులేటర్ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. తరువాత పీఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ, అనకాపల్లి జిల్లాలతోపాటు భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో జరగనున్న అభివృద్ధి, కీలక మార్పుల గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం ఈసారి రొటీన్‌కు భిన్నంగా సాగింది. విశాఖ, అనకాపల్లి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తానేం చేసిందీ, భవిష్యత్తులో చేయబోయేదీ ప్రజలకు అర్థమయ్యేలా స్పష్టంగా వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటితో ఉత్తరాంధ్రలో భూములు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు కూడా వస్తాయన్న సీఎం...తద్వారా ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్, డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు, గ్రీన్ హైడ్రోజన్, రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్ పరిశ్రమ, ఫార్మా కంపెనీల రాకతో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల వస్తాయన్నారు. ఈ తరహాలో జరిగిన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇప్పుడు తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇదే తరహాలో అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందని అన్నారు.
ఇన్నాళ్లూ ఉద్యోగ, ఉపాధి కోసం ఉత్తరాంధ్ర వాసులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం ఉత్తరాంధ్రకు వలస వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర అవుతుంది. దీనిని రాసిపెట్టుకోండి’’ అని స్పష్టంచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వచ్చిన పెట్టుబడులు, ఏర్పాటైన/ఏర్పాటవుతున్న కంపెనీల గురించి విపులంగా వివరించారు. విశాఖపట్నం ఇప్పుడు ఏఐ పట్నంగా, గూగుల్ హబ్‌గా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా మారబోతున్నదని పేర్కొన్నారు. ఒకవైపు పరిశ్రమలు, కంపెనీల రాక, మరోవైపు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల రాకతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఉత్తరాంధ్ర చిరునామాగా మారుతుందని వెల్లడించారు. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖను అభివర్ణించిన ఆయన..ఆసియా మొత్తానికి విశాఖ నుంచి కనెక్ట్ చేసే సబ్ సీ కేబుల్ రానున్నదన్నారు. జాతీయ రహదారులు, నాలుగు వరుసల రైల్వే లైన్లు, మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వంటి వాటితో ఉత్తరాంధ్ర ప్రాంతం మధ్య భారతదేశానికి అనుసంధానం అవుతుందని వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలు అభివృద్ధికి కేంద్రాలుగా పేర్కొన్నారు.
భిన్నంగా సాగిన చంద్రబాబు ప్రసంగం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం ఈసారి రొటీన్‌గా భిన్నంగా సాగింది. చెప్పాలనుకున్న విషయాలను సూటిగా, ప్రజలకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పడంతోపాటు పదునైన పదజాలాన్ని వినియోగించారు. రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను, గత ప్రభుత్వంలో పాలకుల వైఫల్యాలను ఎండగట్టిన తీరు ఆకట్టుకుంది. సీఎంగా తానేం చేశానో స్పష్టంగా వివరించిన ఆయన...ప్రజలు కూడా ఏం చేయాలో ఆలోచించుకోవాలని సూచించడం ఆసక్తి కలిగించింది. సీఎం ప్రసంగంలో పలుమార్లు ప్రజలు కరతాళధ్వనులతో హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఏపీ వైపు దేశం చూపు
- అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్ల నుంచి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు దేశమంతా ఏపీ వైపే చూస్తున్నది. ఇటీవల ఒక సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ తన మాటల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏ పనైనా చేయగల సమర్థ పాలనాదక్షుడు అని ప్రశంసించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను కూటమి ప్రభుత్వం అనకాపల్లి జిల్లాకు తీసుకొస్తే...ఆ ఘనత తమదేనని వైసీపీ నేతలు చెప్పినా ఆశ్చర్యపోనసరం లేదు. ఈ కార్యక్రమం (పోలవరం ఎడమ ప్రధాన కాలువకు నీటి విడుదల) చూసిన తరువాత జగన్‌కు నిద్రపట్టదు. చంద్రబాబునాయుడు ఏ పని చేపట్టినా...అది పూర్తయ్యేంత వరకు వదలరు. ఇప్పుడు పోలవరం ఎడమ కాలవకు నీటి విడుదల విషయంలో మరోసారి రుజువైంది.
అభివృద్ధికి కేరాఫ్ ఉత్తరాంధ్ర
- హోం మంత్రి వంగలపూడి అనిత
ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతమని ముద్రపడింది. అయితే రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నది. డేటా సెంటర్లు, నక్కపల్లిలో స్టీల్‌ప్లాంట్, పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు రావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చిన మహనీయుడు సీఎం చంద్రబాబు.
చంద్రబాబుకు జనం జేజేలు
జై చంద్రబాబు నినాదాలతో మార్మోగిన సభా ప్రాంగణం
పాయకరావుపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాల విడుదల, హారతి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. నీటిని విడుదల చేసిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభా వేదికపైకి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా కేరింతలు, నినాదాలతో హోరెత్తింది. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నంత సేపు జనం ఉత్సాహంగా స్పందిస్తూ జేజేలు పలికారు. ‘జై చంద్రబాబు’, ‘జైజై చంద్రబాబు’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.
చంద్రబాబు వరం
అల్లు వెంకటేశ్వరరావు, మంగవరం, పాయకరావుపేట మండలం
పోలవరం ఎడమ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడం ద్వారా జిల్లా రైతులకు సీఎం చంద్రబాబు వరం అందించారు. రైతులతోపాటు యావత్ ప్రజానీకం ఆయనకు రుణపడి ఉంటారు. పోలవరం కాలువ వల్ల సాగునీటితోపాటు తాగునీటి సమస్య కూడా తొలగిపోతుంది.
చంద్రబాబు అపర భగీరథుడు
తిరుమలరాజు అప్పలరాజు, నెల్లిపూడి, నక్కపల్లి మండలం
మాది పూర్తిగా మెట్ట ప్రాంతం. వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి. ఇటువంటి నేలకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి నీటిని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపర భగీరఽథుడు. మా ప్రాంత ప్రజల కలలు ఇన్నాళ్లకు సాకారం అయ్యాయి.