మళ్లీ గోబర్ గ్యాస్..
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:59 AM
పశ్చిమాసియాలో ఐదు వారాల నుంచి జరుగుతున్న యుద్ధం ప్రభావం వంట గ్యాస్ సరఫరాపై పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గోబర్ గ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నామమాత్రపు ఖర్చుతో వంట గ్యాస్ ఉత్పత్తి అవుతుండడంతో పశు పెంపకందారులు మొగ్గు చూపుతున్నారు.
ఎల్‌పీజీ కొరతతో బయో గ్యాస్ వైపు గ్రామీణుల చూపు
గతంలో రైతుల ఇళ్లల్లో గోబర్ గ్యాస్ యూనిట్లు
సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించిన నెడ్‌క్యాప్
కొన్నేళ్ల తరువాత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఎల్‌పీజీ
ఒక్కొక్కటిగా మూతపడిన గోబర్ గ్యాస్ యూనిట్లు
పశ్చిమాసియా యుద్ధంతో పునరుత్పాదక ఇంధన వనరులపై గ్రామీణుల ఆసక్తి
చోడవరం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి):
పశ్చిమాసియాలో ఐదు వారాల నుంచి జరుగుతున్న యుద్ధం ప్రభావం వంట గ్యాస్ సరఫరాపై పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గోబర్ గ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నామమాత్రపు ఖర్చుతో వంట గ్యాస్ ఉత్పత్తి అవుతుండడంతో పశు పెంపకందారులు మొగ్గు చూపుతున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు గ్రామీణ ప్రాంతంలో రైతుల ఇళ్ల వద్ద ప్రత్యేకంగా గోబర్ గ్యాస్ ప్లాంటు ఉండేవి. అప్పట్లో పెట్రోలియం కంపెనీల వంట గ్యాస్ ఏజెన్సీలు కేవలం పట్టణాల్లో మాత్రమే వుండడంతో, గ్యాస్ కనెక్షన్ కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచివుండాల్సి రావడంతో చాలా మంది గోబర్ గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా గోబర్ గ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వరంగ సంస్థ అయిన నెడ్‌క్యాప్ భారీ ఎత్తున సబ్సిడీ ఇచ్చింది. దీంతో పశువులు వున్న రైతుల్లో ఎక్కువ మంది ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు చాలా గ్రామాల్లో రైతులు గోబర్ గ్యాస్ ప్లాంట్లను ఉపయోగించారు. అయితే గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం రోజూ పశువుల పేడలో నీరు కలిపి, చేతులతో బాగా కలియబెట్టి యూనిట్‌లో పోయాల్సి వచ్చేది. ఇందుకోసం కొంతసమయం కేటాయించాలి. అయితే సుమారు రెండు దశాబ్దాల నుంచి మండల కేంద్రాల్లో కూడా గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కావడం, దరఖాస్తు చేసిన వెంటనే గ్యాస్ కనెక్షన్ ఇస్తుండడం, ఇదే సమయంలో దీపం పథకం కింద ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో మారుమూల గ్రామాల్లో సైతం ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగం పెరిగింది. దీంతో గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూలకుచేరాయి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి రోజున ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. దీంతో గల్ఫ్ దేశాల నుంచి ఎల్‌పీజీ దిగుమతి తగ్గింది. యుద్ధం ప్రభావంతో వాణిజ్య అవసరాల గ్యాస్ సరఫరాలో భారీ ఎత్తున కోత విధించింది. గృహ వినియోగ సిలిండర్లు సైతం బుక్ చేసిన రెండు, మూడు వారాల తరువాతే డెలివరీ చేస్తున్నారు. దీంతో రైతుల చూపు మళ్లీ గోబర్ గ్యాస్ ప్లాంట్లపవైపు మళ్లింది. గోబర్ గ్యాస్ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తున్నారు.
నెలకు రూ.వెయ్యి ఆదా
జి.శ్రీనివాసరావు, ఏడీ, పశు సంవర్థక శాఖ, చోడవరం
పశువులు వున్న రైతులు గోబర్ గ్యాస్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.వెయ్యి వరకు ఆదా అవుతాయి. వంట గ్యాస్ సిలిండర్ కోసం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఒక ఆవు లేదా గేదె రోజుకి 20 కిలోల పేడ వేస్తుంది. రెండు పశువులు వేసే పేడతో ఒక కిలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఒక రోజుకు సరిపోతుంది. ఇది పర్యావరణ హితంగానూ ఉంటుంది.