Share News

రైల్వే స్టేషన్‌లో జీఎం తనిఖీలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:17 AM

దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేశారు. మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

రైల్వే స్టేషన్‌లో జీఎం తనిఖీలు

మౌలిక సదుపాయాలు పరిశీలన

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):

దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేశారు. మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సౌకర్యాలను మరింత మెరుగుపరచడంపై అధికారులతో చర్చించారు. ప్లాట్‌ఫామ్‌లపై పర్యటించి రైళ్ల రాకపోకలను, కోచ్‌ ఇండికేటర్ల పనితీరును గమనించారు. అలాగే రైళ్ల రాకపోకల్లో ఆలస్యానికి గల కారణాలను ఆరా తీశారు. అనంతరం స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కియోస్క్‌ ఆఫ్‌ ఏఐ (సరికా ఏఐ) పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏఐ ద్వారా రైళ్ల రాకపోకలు, ప్లాట్‌ఫాం నంబర్లు, రైళ్ల వేళలు, కోచ్‌ల స్థానం వంటి సమాచారం పొందవచ్చునని జీఎంకు డీఆర్‌ఎం వివరించారు. అలాగే టికెట్‌ కౌంటర్లు, వెయిటింగ్‌ హాల్స్‌, క్లోక్‌ రూమ్స్‌, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, వైద్య సహాయం, ఫుడ్‌ కోర్టులు, పార్కింగ్‌, వీల్‌ చైర్ల సాయం వంటి సౌకర్యాలకు సంబంధించిన సమాచారం కూడా సరికా ఏఐ ద్వారా పొందవచ్చునని అధికారులు వివరించారు. హ్యూమనాయిడ్‌, కియోస్క్‌ ఫార్మట్లలో అందుబాటులో సరికా ఏఐ తొమ్మిది భాషల్లో సమాచారం ఉంటుందని పేర్కొన్నారు.


22, 23 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల క్రీడా మంత్రుల సమావేశం

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో బ్రిక్స్‌ దేశాల క్రీడా మంత్రులు, అధికారుల సమావేశం జరగనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ఈ సమావేశానికి 11 దేశాలకు సంబంధించిన మంత్రులు, అధికారులు పాల్గొంటున్నందున అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు 21, 22 తేదీల్లో నగరానికి చేరుకుంటారని, 24న తిరిగి వెళతారని పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇఽథోపియా, ఇండోనేషియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు మొత్తం సుమారు 70 మంది వరకు వస్తున్నారని, రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖా మంత్రి హాజరుకానున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద స్వాగత ఏర్పాట్లు, రవాణా వంటివి చేయాలని సూచించారు. అదేవిధంగా 23 తేదీన ఆర్కే బీచ్‌రోడ్డులో సైకిల్‌ ర్యాలీ, కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమం ఉంటాయని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో డీసీపీ మణికంఠ, డీఆర్‌వో విశ్వేశ్వరనాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


వీఎంఆర్‌డీఏ పునర్వ్యవస్థీకరణ

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):

ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను వీకేపీసీపీఐఆర్‌ (విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం, కెమికల్‌, పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌) పరిధిలోకి ప్రభుత్వం బదలాయించింది. విశాఖ జిల్లా పెదగంట్యాడ, అనకాపల్లి జిల్లా పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు చెందిన 492.71 చ.కి.మీ. వీకేపీసీపీఐఆర్‌ పరిధిలోకి మార్చింది. జీవీఎంసీ, విజయనగరం కార్పొరేషన్‌, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని 45 మండలాలు...మొత్తం 7341.02 చ.కి.మీ. విస్తీర్ణం వీఎంఆర్డీఏ పరిధిగా నిర్ణయించారు.


జోనల్‌ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌కు కమిషనర్‌

ఒక్కో వారం ఒక్కో జోనల్‌ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరణ

కేతన్‌గార్గ్‌ నిర్ణయం

విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):

ఇకపై జోనల్‌ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో స్వయంగా పాల్గొనాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం ఆయన అనకాపల్లి జోనల్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇకపై ప్రతి సోమవారం ఒక్కో జోనల్‌ కార్యాలయానికి వెళ్లి పీజీఆర్‌ఎస్‌లో పాల్గొంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. దీనివల్ల ప్రజలు జీవీఎంసీకి ఎలాంటి సమస్యల పరిష్కారానికి వస్తున్నారనేది తెలుసుకునే అవకాశం కలుగుతుందని కమిషనర్‌ భావిస్తున్నారు. ఇప్పటివరకూ కమిషనర్‌ జీవీఎంసీ ప్రధానకార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తే...జోనల్‌ కమిషనర్లు తమ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించేవారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జోన్‌ల కమిషనర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్‌ సూచనలు ఇచ్చేవారు. ఇకపై జోనల్‌ కార్యాలయాల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో తాను పాల్గొనాలని కమిషనర్‌ నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు మరింతగా కృషిచేసే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

Updated Date - Aug 18 , 2026 | 01:17 AM