Share News

సమష్టి కృషితో కాఫీకి ప్రపంచ ఖ్యాతి

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:09 AM

అందరి సమష్టి కృషితోనే మన్యంలోని కాఫీకి ప్రపంచ ఖ్యాతి లభించిందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో బుధవారం నిర్వహించిన ఆర్‌వీ నగర్‌ కేంద్ర కాఫీ పరిశోధనా స్థానం స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సమష్టి కృషితో కాఫీకి ప్రపంచ ఖ్యాతి
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అందరి సమష్టి కృషితోనే మన్యంలోని కాఫీకి ప్రపంచ ఖ్యాతి లభించిందని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో బుధవారం నిర్వహించిన ఆర్‌వీ నగర్‌ కేంద్ర కాఫీ పరిశోధనా స్థానం స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 50 ఏళ్లుగా ఆర్‌వీ నగర్‌ కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధనా స్థానం అందించిన సేవలు గిరిజన ప్రాంతానికి బహుళ ప్రయోజనం చేకూర్చాయన్నారు. తూర్పు కనుమల్లో కాఫీ సాగు విస్తరణ, గిరి రైతుల జీవనోపాధి పెంపు, పోడు వ్యవసాయం నిర్మూలన, పర్యావరణ పరిరక్షణకు పరిశోధనా కేంద్రం విశేషంగా కృషి చేసిందన్నారు. 1971లో కేవలం 15 టన్నుల కాఫీ ఉత్పత్తి నుంచి నేడు 15 వేల టన్నుల ఉత్పత్తికి, కాఫీ సాగు అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ఫలితంగా ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో నేడు లక్షా 12 వేల హెక్టార్లతో కాఫీ సాగవుతుందని కలెక్టర్‌ తెలిపారు. కాఫీ బోర్డు అధికారులు, సిబ్బంది, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, విస్తరణ బృందాలు, అనుబంధ ప్రభుత్వ శాఖలు, గిరి రైతుల నిరంతర కృషితోనే కాఫీలో విజయాలు సాధించారని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కాఫీ అభివృద్ధిలో అనేక విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అరకు కాఫీ విజయానికి గిరిజన రైతులే అసలైన శక్తి అని, కాఫీ సాగుతో గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి, మెరుగైన ఆదాయం లభిస్తుండడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి పొందిన అరకు కాఫీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు. ఫలితంగా గిరిజన సమాజం ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌ఆర్‌ మురళీధర్‌, కాఫీ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్‌ డి.సునీల్‌బాబు, పరిశోధనా స్థానం మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సూర్యప్రకాశరావు, కాఫీ బోర్డు సీనియర్‌ లైజన్‌ అధికారి ఎన్‌.రమేశ్‌, ఏపీఎఫ్‌డీసీ, ఉద్యానవన శాఖల అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థలు, రైతులు ఉత్పత్తిదారు సంఘాల ప్రతినిధులు, గిరిజన కాఫీ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:09 AM