Share News

మొక్కల పంపిణీపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:27 PM

గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా అందించిన మొక్కలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశాలు జారీచేశారు.

మొక్కల పంపిణీపై నివేదిక ఇవ్వండి
ఆంధ్రజ్యోతి’ కథనాల క్లిప్పింగ్‌లు

డ్వామా పీడీకి కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్‌ చేయండి

చనిపోయిన మొక్కల స్థానే కొత్తవి అందించండి

సరఫరాదారులకు చెల్లింపులు వద్దని స్పష్టీకరణ

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌...

పాడేరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి):

గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా అందించిన మొక్కలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో సిల్వర్‌ఓక్‌, ఇతర మొక్కల పంపిణీలో అవకతవకలు, నాసిరకం మొక్కల పంపిణీపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన వరుస కథనాలకు జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి స్పందించారు. దీంతో క్షేత్ర స్థాయిలో సందర్శనలు జరిపి మొక్కల పంపిణీ వ్యవహారంపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగరరావును శనివారం ఆమె ఆదేశించారు. ముఖ్యంగా మొక్కల పంపణీ ప్రక్రియ, మొక్కల నాణ్యత, ప్రస్తుతం ఆయా మొక్కల స్థితిగతులు, పలు చోట్ల మొక్కలు చనిపోవడానికి గల కారణాలు, సంబంధిత అమలు ప్రక్రియలు, తదితర అంశాలపై సమగ్రమైన నివేదికను సమర్పించాలన్నారు. గిరిజన రైతులు నష్టపోకుండా చూడాలని, ఈ క్రమంలో చనిపోయిన మొక్కల స్థానంలో వారికి కొత్త మొక్కలను అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పక్కాగా మొక్కలు పంపిణీ జరిగే వరకు సరఫరాదారులకు ఎటువంటి చెల్లింపులు జరపవద్దని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రైతులకు పంపిణీ చేసిన మొక్కలను ఈఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా పర్యవేక్షించాలన్నారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్‌ చేయాలని ఆమె సూచించారు. ఇకపై గిరిజన రైతులకు అందించే మొక్కల విషయంలోనూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు నిబంధనలు పాటించాలని, పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

గిరిజన రైతుల ప్రయోజనాలకు పెద్దపీట

పండ్ల మొక్కల ద్వారా గిరిజన రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. రైతులు దీర్ఘకాలిక ఆదాయం పొందాలనే ఆలోచనతోనే పండ్ల మొక్కలను అందిస్తున్నామన్నారు. గిరిజన రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వారికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందని కలెక్టర్‌ నిషాంతి స్పష్టం చేశారు.

Updated Date - Sep 19 , 2026 | 11:27 PM