బాలికలదే పైచేయి
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:05 AM
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురు కంటే అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను బుధవారం మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం 85 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే అధిక శాతం ఉత్తీర్ణత
మొత్తమ్మీద ప్రథమ సంవత్సరంలో
85ు ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో
మూడో స్థానంలో నిలిచిన జిల్లా
ద్వితీయ సంవత్సరంలో 86ు శాతం పాస్‌తో ఆరో స్థానం
గత ఏడాదితో పోల్చితే మొదటి సంవత్సరంలో మెరుగు,
సెకండియర్‌లో తరుగు...
మద్దిలపాలెం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి)
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురు కంటే అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను బుధవారం మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం 85 శాతం ఉత్తీర్ణతతో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం 86 శాతం ఉత్తీర్ణతతో ఆరో స్థానంలో ఉంది. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 38,392 మంది హాజరవ్వగా 32,334 మంది (85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 17,715 మందికిగాను 15,096 మంది (85.22 శాతం), బాలురు 20,677 మందికి 17,238 (83.37 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 37,903 మంది రాయగా 32,034 మంది (86 శాతం) పాసయ్యారు. బాలికలు 17,626 మందికి 15,298 మంది (86.8 శాతం), బాలురు 20,277 మందికి 16,736 మంది (82.54 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఆరు శాతం పెరిగింది. ద్వితీయ సంవత్సరంలో గత ఏడాది 87 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ ఏడాది ఒక శాతం తగ్గి 86 శాతం నమోదైంది.
ప్రథమ సంవత్సరం పరీక్షలు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల నుంచి 152 మంది రాయగా 117 మంది (76.97 శాతం), ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుంచి 87 మందికి 85 మంది, ప్రైవేటు కళాశాలల నుంచి 35,980 మంది రాయగా 31,143 మంది (86.56 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సోషల్ వెల్ఫేర్ కళాశాలల నుంచి 156 మందికి 137 మంది (87.82 శాతం), ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల నుంచి 89 మందికి 88 మంది, కేజీబీవీ కళాశాల నుంచి 88 మందికి 82 మంది, ప్రైవేటు కళాశాలల నుంచి 35,773 మందికి 30,690 మంది (85.79 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ఒకేషనల్ ఫలితాలు
ఒకేషనల్ ఫలితాల్లో ఈ ఏడాది జిల్లా విద్యార్థులు వెనుకబడ్డారు. గత ఏడాది 74 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ ఏడాది 70 శాతానికి పడిపోయింది. జిల్లాలోని 17 కళాశాలల నుంచి 3,250 మంది ఒకేషనల్ పరీక్షలు రాయగా 2,275 మంది (70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం నుంచి 1773 మంది హాజరుకాగా 1,080 మంది (60.91 శాతం), రెండో సంవత్సరం 1,477 మందికి 1,175 మంది (79.55 శాతం) ఉత్తీర్ణులయ్యారు.