బాలిక అపహరణ!
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:41 AM
విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేయడం కలకలానికి దారితీసింది.
రైల్వే స్టేషన్ వద్ద ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల చెంత నిద్రపోతుండగా ఎత్తుకుపోయిన యువతీయువకుడు
పోలీసుల దృష్టికి వెళ్లినట్టు తెలియడంతో ఎస్.రాయవరంలో వదిలేసి పరారీ
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేయడం కలకలానికి దారితీసింది. సయ్యద్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మలు దంపతులు. విజయవాడకు చెందిన వీరు ఊరూరా తిరుగుతూ దుకాణాల్లో దేవుడి పటాలకు ధూపం వేసి జీవనం సాగిస్తుంటారు. మూడు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారు. రైల్వేస్టేషన్ సమీపానున్న పుట్‌పాత్‌పై గురువారం రాత్రి నాలుగేళ్ల కుమార్తెతో కలిసిపడుకోగా, ఓ యువకుడు, యువతి స్కూటర్‌పై వచ్చి ఆ బాలికను ఎత్తుకుపోయారు. తెలివి వచ్చాక పక్కన కుమార్తె లేకపోవడం చూసి ఆ చుట్టు పక్కల వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు (యువతి, యువకుడు) ఆ పాపను తీసుకువెళ్లినట్టు గుర్తించారు. స్కూటర్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేయగా, దాని యజమాని తన దగ్గర ఓ మిత్రుడు నెల రోజుల క్రితం స్కూటర్ తీసుకువెళ్లినట్టు తెలిపాడు. ఆ మిత్రుడి మొబైల్ నంబరును ట్రాకింగ్ చేయగా ఎస్.రాయవరంలో ఉన్నట్టు చూపించింది. పోలీసులు ఈ సమాచారం అక్కడికి చేరవేయడంతో నిందితులు ఆ బాలికను ఎస్.రాయవరంలో వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై ఏసీపీ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, బాలిక దొరికిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఎందుకు ఎత్తుకువెళ్లినట్టు..?
ఎస్.రాయవరానికి చెందిన ప్రతిభ, గరివిడి ప్రాంతానికి చెందిన ఉపేంద్రలు బాలికను ఎత్తుకువెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు. ఎస్.రాయవరంలో పిల్లలు లేనివారి కోసం ఈ బాలికను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులకు విషయం తెలిసిందని పసిగట్టి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. అయితే వీరిద్దరూ ఇలా కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఏమైనా చేశారా?, అంతకు తెగించాల్సిన అవసరం ఏమి వచ్చింది?, వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి?...అనే వివరాలు బయటపడాల్సి ఉంది.
కాలుష్యంపై కొరడా
నియంత్రణలో రాజీపడేది లేదు
పరిశ్రమల యాజమాన్యాలకు పీసీబీ స్పష్టీకరణ
సరకు రవాణాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
పచ్చదనం పెంపొందించాలి
ప్రణాళిక రూపొందించుకుని పటిష్టంగా అమలుచేయాలి
గత ఏడాది విధించిన జరిమానా చెల్లించాల్సిందే
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కాలుష్య నియంత్రణ విషయంలో రాజీపడేది లేదని పరిశ్రమలు, వాటి పరిధిలో ఉండే వ్యాపార సంస్థలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టంచేసింది. పరిమితికి మించి కాలుష్యం విడుదల చేస్తూ గాలి నాణ్యత క్షీణించడానికి కారణమైన పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు గత ఏడాది విధించిన జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పరిశ్రమలు, వాటికి అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల ప్రతినిధులతో రెండు రోజుల క్రితం విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.
నగరంలో 2025 డిసెంబరు నుంచి 2026 జనవరి వరకు గాలిలో నాణ్యతను బట్టి తనిఖీలు చేసి పలు పరిశ్రమలకు జరిమానా విధించడం జరిగిందని, వాటిని చెల్లించాలని ఆదేశించారు. గాలి నాణ్యత పెంపు కోసం బహిరంగ ప్రదేశాల్లో బొగ్గు, ఇనుము నిల్వలపై పూర్తిగా టార్పాలిన్లు కప్పడం, కార్యో హ్యాండ్లింగ్‌లో యాంత్రీకరణ, చెట్ల పెంపకం వంటివి చేపట్టాలని సూచించారు. విశాఖ పోర్టు, ఎన్టీపీసీ, హిందూజా, ఉక్కు కర్మాగారం, రాంకీ ఫార్మా సిటీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మూడు నుంచి ఆరు నెలల కాలానికి ప్రణాళిక రూపొందించామని, పీసీబీ ఆదేశాల మేరకు వాటిని అమలు చేస్తామని పలు పరిశ్రమలు ప్రతినిధులు వెల్లడించారు.
విశాఖ పోర్టు పరిధిలో ఆపరేటింగ్ సంస్థలు నిబంధనలు పాటించాలని పీసీబీ స్పష్టంచేసింది. జిప్సం నిల్వలో తగిన ప్రమాణాలు పాటించాలని కోరమాండల్ ఎరువుల కర్మాగారం యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా బొగ్గు, బూడిద రవాణాలో ఎటువంటి లీకేజీలు లేకుండా చూడాలని, గాలికి ధూళి లేవకుండా రోడ్లపై నీరు స్ర్పే చేయాలని హిందూజా, ఎన్టీపీసీ సంస్థలకు స్పష్టంచేసింది. కోక్ ఓవెన్ బ్యాటరీ, ఇతర యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఉక్కు కర్మాగారం యాజమాన్యానికి సూచించింది. పరిసర ప్రాంతాలకు దుర్గంధం వ్యాపించకుండా చూడాలని, మురుగునీరు సమీపంలోని చెరువుల్లో వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పరవాడ రాంకీ ఫార్మా సిటీ ప్రతినిధులను ఆదేశించింది. ప్రతి పరిశ్రమలో 33 శాతం పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని సూచించారు. విశాఖ నగరంలో 2025 డిసెంబరులో గాలి నాణ్యత క్షీణతను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది శీతాకాలంలో కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆదేశించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరి రక్షణ దృష్ట్యా బోర్డు ఆదేశాలు పాటించని పరిశ్రమలు మూసివేస్తామని స్పష్టంచేశారు.