డోలీ రహిత గ్రామాలుగా గిరి పల్లెలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:37 PM
రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి రహదారి సదుపాయాన్ని అనుసంధానం చేసి డోలీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం అందుబాటులో ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
అభివృద్ధి పనులపై అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమీక్ష
పాడేరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి రహదారి సదుపాయాన్ని అనుసంధానం చేసి డోలీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి జన్‌మన్, అడవితల్లి బాట కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మారుమూల గిరిజన పల్లెలకు సైతం రోడ్డు సదుపాయం అందుబాటులోకి రావాలన్నారు. రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో అవసరమైన సామగ్రి అందుబాటులో లేకుంటే సమీపంలోనే వాటిని సేకరించేందుకు గాను క్వారీలకు అవసరమైన అనుమతులను ఇవ్వాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్‌కు కలెక్టర్ సూచించారు. అలాగే అటవీ అనుమతులకు సంబంధించి ఎటువంటి పెండింగ్ ఉన్నా తక్షణమే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వాటిని పరిష్కరించుకుని పనులు చేపట్టాలన్నారు. ఎక్కడైనా రోడ్ల నిర్మాణానికి గాని, గిరిజనుల సాగుభూములకు అటవీ హక్కులు కల్పించేందుకు గాని ఎటువంటి సమస్యలు ఏర్పడినా వాటిని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు ఈ నెల 5 నుంచి వంద రోజుల ప్రణాళికను రూపొందించుకుని లక్ష్యం మేరకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రానున్న మూడు నెలల్లో ఆయా రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా పనులు జరగాలన్నారు. టెండర్లు దక్కించుకుని ప్రారంభించని రోడ్ల పనులుంటే తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చించి పనులు మొదలు పెట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న రోడ్లకు సంబంధించిన హెచ్చరికల బోర్డుల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. వివిధ ఇంజనీరింగ్ శాఖలు, జాతీయ ఉపాధి హామీ పథకం, పీఎం జన్‌మన్‌లో భాగంగా మంజూరైన అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్లు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, డ్వామా పీడీ విద్యాసాగర్, పంచాయతీ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు టి.కొండయ్యపడాల్, బి.రవికుమార్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు జి.డేవిడ్‌రాజు, కె.వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.