నిగ్గు తేల్చండి!
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:16 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల పేరుతో వసూళ్ల కు పాల్పడిన వ్యవహారాన్ని వర్సిటీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
ఏయూలో ఉద్యోగాల పేరుతో వసూళ్లు
మూడో పట్టణ పోలీసులకు రిజిస్ర్టార్ ఫిర్యాదు
అంతర్గత విచారణకు వర్సిటీ అధికారుల ఆదేశం
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల పేరుతో వసూళ్ల కు పాల్పడిన వ్యవహారాన్ని వర్సిటీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో మరింతమంది రెచ్చిపోయే అవకాశం ఉండడంతో రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు మంగళవారం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని వెనుక ఎవరున్నారన్న అంశాలను ఆరాతీశారు. తాజాగా వర్సిటీ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయి విచారణకు సిద్ధమవుతున్నారు.
కాగా ఏయూ అధికారులు వర్సిటీలో అంతర్గత విచా రణ ప్రారంభించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎంత మందికి ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు, ఎన్ని బయటపడ్డాయో తెలుసుకుంటున్నారు. ఏయే విభాగాల్లో పోస్టింగ్స్ ఇచ్చారన్న విషయాలను సేకరిస్తున్నారు. వర్సిటీ కి చెందిన ఉద్యోగుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఇందు లో భాగంగా కీలక విభాగాలకు చెందిన అధికారులకు బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రెండురోజులుగా అధికారులు పలువురు ఉద్యోగులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్నారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వచ్చాయని, ఉద్యోగాలు నిజమేనా అంటూ కొన్ని విభాగాలకు అభ్యర్థులు ఫోన్లు చేసినట్టు చెబుతున్నారు. ఆయా విభాగాల ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తెచ్చినట్టు చెబుతున్నారు. ఒక వైపు పోలీసులు, మరోవైపు వర్సిటీ అధికారుల విచారణతో ఈ వ్యవహారం వెనకున్న వారు రెండు, మూడు రోజుల్లో బయపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రుషికొండకు నేడు మంత్రుల రాక
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
రుషికొండలో పర్యాటక శాఖ భవనాన్ని పరిశీలించడానికి ముగ్గురు మంత్రులు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. ఈ భవనాన్ని లీజుకు ఇచ్చే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కమిటీ పరిశీలనలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి బుధవారం వస్తున్నారు. సాయంత్రం భవనాన్ని పరిశీలించి, అక్కడే సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
కొళాయి కనెక్షన్లకు ఎదురుచూపులు
చార్జీలు చెల్లించినా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు
తాగునీటికి తప్పని ఆగచాట్లు
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో కొళాయి కనెక్షన్‌ల కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త కొళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, జీవీఎంసీ అధికారులు సూచించిన మొత్తాన్ని చెల్లించి నెలలు గడుస్తున్నా కొత్తకనెక్షన్ మాత్రం ఇవ్వకపోవడంతో బాధితులు నీటికోసం గగ్గోలు పెడుతున్నారు.
జీవీఎంసీ పరిధిలో కొత్తగా నిర్మించిన భవనాలు, నివాసాలకు కొళాయి నీరు కావాలంటే కనెక్షన్ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత పైప్‌లైన్ వేసేందుకు అయ్యే ఖర్చుతోపాటు జీవీఎంసీకి చెల్లించాల్సిన ఫీజులను లెక్కించి ఎస్టిమేషన్ ఇస్తారు. ఆ మొత్తాన్ని జీవీఎంసీ పేరిట బ్యాంక్‌లో డీడీ రూపంలో చెల్లించి ఆ వివరాలను తిరిగి నీటిసరఫరా విభాగం అధికారులు అందజేయాలి. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత నీటిసరఫరా విభాగం అధికారులు సమీపంలోని మెయిన్‌లైన్‌నుంచి కొత్తపైప్‌లైన్ వేసి, ఆ నివాసం లేదా భవనానికి కొత్తకొళాయి కనెక్షన్ జారీచేస్తారు. వ్యక్తిగత ఇల్లు అయితే సాధారణ కనెక్షన్, గ్రూప్‌హౌస్/అపార్టుమెంట్ అయితే సెమీబల్క్ కనెక్షన్ ఇస్తారు. తర్వాత ప్రతినెలా అధికారులు నిర్దేశించిన మొత్తాన్ని చార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా గత ఆరునెలల్లో జీఈవీఎంసీ పరిధిలో సుమారు వంద వరకు కొత్త కొళాయి కనెక్షన్‌ల కోసం దరఖాస్త్తులు రాగా, వాటిలో 60కిపైగా కనెక్షన్లకు అన్నిరకాల చార్జీలు చెల్లించడంతో పైప్‌లైన్ నిర్మాణం పూర్తిచేశారు. ఆయా భవనాల వద్ద కొళాయి కనెక్షన్ ఇచ్చేస్తే ప్రక్రియ పూర్తయిపోతుంది.
అయితే పైప్‌లైన్ నిర్మాణం పూర్తయినప్పటికీ నీటిసరఫరా విభాగం అధికారులు కొళాయి కనెక్షన్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టేశారు. దీనివల్ల ఆయా భవనాలకు కొళాయి నీరు అందడం లేదు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటి బోర్లు కూడా ఎండిపోయాయి. దీంతో అపార్టుమెంట్ల వాసులకు తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేక ట్యాంకర్లతో కొనుగోలు చేసుకుంటున్నారు. కనెక్షన్ ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. వేసవి నేపథ్యంలో ప్రస్తుత కనెక్షన్‌లకు నీటి ఇబ్బందులు రాకుండా కొత్త కనెక్షన్లకు నీరు ఇవ్వడం లేదని చెబుతున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం నీరు ఇస్తున్నవారికి పది నిమిషాలు తగ్గించి, నీటికోసం అల్లాడుతున్నవారికి కొళాయిలు ఇస్తే ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు.