స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధంకండి
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:57 PM
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించే అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
ఉత్తమ సేవలకు తగిన సత్కరిద్దాం
ఏఎస్‌ఆర్ అంటే.. అడాప్ట్, షోకస్, రిప్లికేషన్
భావనతో అత్యున్నత ఫలితాలు సాధిద్దాం..
పాడేరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించే అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేడుకల్లో చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖాలకు చెందిన అధికారులు సమన్వయంగా వ్యవహరించి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించి, చక్కని ఫలితాలు సాధించిన అధికారులు, ఉద్యోగులకు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో తగిన రీతిలో సత్కరిస్తామన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏఎస్‌ఆర్ అంటే... అడాప్ట్, షోకస్, రిప్లికేషన్ అనే భావనతో ప్రతి ప్రభుత్వ శాఖ ఇప్పటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రత్యేకంగా కృషి చేసి అత్యున్నత ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంపై ముమ్మర ప్రచారం
ఆగస్టు ఒకటిన భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ముమ్మరంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ నిషాంతి సూచించారు. విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారన్నారు. ప్రజలకు విమానాశ్రయం ప్రాముఖ్యత, ప్రత్యేకతలపై అవగాహన కల్పించాలన్నారు. అల్లూరి సీతారామరాజు పేరిట నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయంగా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఆర్డీవో ఎం.భుజంగరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, డీఆర్‌డీఏ పీడీ జయకృష్ణ, హౌసింగ్ పీడీ బి.బాబు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, పీఆర్ ఈఈ టి.కొండయ్యపడాల్, మత్స్యపరిశ్రమ అధికారి శ్రీనివాసరావు, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.