Share News

గెడ్డలో దిగి.. కొండనెక్కి..

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:11 PM

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి సందర్శించారు. పరదానిపుట్టు పొలిమేర నుంచి ప్రజలతో కలిసి నడిచారు.

గెడ్డలో దిగి.. కొండనెక్కి..
గెడ్డలో నడుచుకుంటూ డూరుపల్లి గ్రామానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ నిశాంతి.

పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాల్లో యువ కలెక్టర్‌ పర్యటన

డూరుపల్లికి అంగన్‌వాడీ భవనం..

పరదానిపుట్టుకు పాఠశాల భవనం, హైలెవెల్‌ వంతెన మంజూరు

15 రోజుల్లో విద్యుత్‌ సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్‌ హామీ

పెదబయలు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్‌ టి.నిశాంతి సందర్శించారు. పరదానిపుట్టు పొలిమేర నుంచి ప్రజలతో కలిసి నడిచారు. గ్రామంలోని వీధులను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మమేకం అయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో తనకు కేటాయించినా కుర్చీలో కాకుండా నేలపైనే కూర్చొని ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డూరుపల్లి గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. పరదానిపుట్టు గ్రామంలో పాఠశాల భవనం, హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. గ్రామంలో విద్యుత్‌ సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వెల్‌నెస్‌ సెంటర్‌, హాట్‌ బజార్‌, డంపింగ్‌ యార్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో విధ్యూత్‌ సమస్యను 15 రోజుల్లో పరిష్కారిస్తానని హామి ఇచ్చారు. రేషన్‌ కార్డులు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాల మధ్య ఉన్న గెడ్డలో దిగి నడుకుంటూ, కొండలు ఎక్కారు.. ఈ యువ కలెక్టర్‌ తీరును చూసి గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 18 , 2026 | 11:11 PM