Share News

జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - May 23 , 2026 | 11:24 PM

జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్‌కో ఉద్యోగి ధార సింహాచల పాత్రో (57) అలియాస్‌ ధారబాబు పాత్రో శనివారం ఉదయం జెన్‌కో కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య
మృతి చెందిన జెన్‌కో ఉద్యోగి ధార సింహాచల పాత్రో (ఫైల్‌ఫొటో).

అనారోగ్య సమస్యలతో వరుసగా మృతి చెందిన సహ ఉద్యోగులు

మానసిక ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడిన సింహాచల పాత్రో

సీలేరు, మే 23 (ఆంధ్రజ్యోతి):

సీలేరు రెగ్యులేటర్‌ డ్యామ్‌ వద్ద ఫోర్‌మేన్‌గా ధార సింహాచల పాత్రో విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య దేవకి, కుమారుడు నవీన్‌ ఉన్నారు. గత రెండు నెలలుగా సీలేరులో తన తోటి జెన్‌కో ఉద్యోగులు అనారోగ్య సమస్యలతో హఠాత్తు మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో సింహాచల పాత్రో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తోటి ఉద్యోగులు, స్నేహితులతో ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ బాధపడుతుండేవాడు. ఇటీవల కాలంలో విధులు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నాడు. తాను రాత్రి డ్యూటీలు చేయలేకపోతున్నానని స్థానిక జెన్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తన మానసిక పరిస్థితి కుదుట పడేంతవరకు వేరేచోటకి మార్పు చేస్తామని, రెగ్యులేటర్‌ డ్యాం వద్ద నైట్‌ డ్యూటీ లేకుండా జెన్‌కో అధికారులు సింహాచల పాత్రోకు వెసులుబాటు కల్పించారు. ఉద్యోగం చేయలేకపోతే వీఆర్‌ఎస్‌ పెట్టుకుని మైదాన ప్రాంతానికి వెళ్లిపోతే.. తమకు వచ్చే పింఛన్‌తో కుటుంబ పోషణకు సరిపోతుందని ఓదార్చేవారని భార్య దేవకి తెలిపింది. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో పాత్రో లేచి తాను బయోమెట్రిక్‌ వేసి వస్తానని భార్యతో చెప్పి వెళ్లారని, భర్త వెళ్లిన తరువాత తాను, తన కుమారుడు నవీన్‌ నిద్రపోయామన్నారు. ఉదయం ఏడున్నరకు లేచి కిచెన్‌ రూమ్‌ తలుపులు తీసి చూడగా తన భర్త దూలానికి ఉరి వేసుకుని వేలాడుతున్నాడని భార్య దేవకి తెలిపారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఆసుపత్రికి తరలించామని సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ తెలిపారు. ధారబాబు పాత్రో ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఏపీ జెన్‌కో ఎస్‌ఈ జాకీర్‌ హుస్సేన్‌, ఈఈ అప్పలనాయుడు, ఏడీఈ జైపాల్‌, ఏఈఈ సురేష్‌, తోటి ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.

Updated Date - May 23 , 2026 | 11:24 PM