సర్‌కు సన్నద్ధం
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:57 AM
జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేసింది.
రేపటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
ఇంటింటికీ బీఎల్‌వోలు
2026 మే నెలాఖరు నాటికి ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరికీ ఎన్యుమరేషన్ ఫారాలు
అవి ప్రతిఒక్కరూ పూరించి తప్పనిసరిగా తిరిగి అందజేయాలి
లేనిపక్షంలో జాబితాలో పేరు గల్లంతే
వచ్చే నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల
జిల్లాలో 1980 బూత్‌లు
20.23 లక్షల మంది ఓటర్లు
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేసింది. సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు సర్ ఎన్యుమరేషన్ జరగనున్నది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల 1,980 పోలింగ్ బూత్‌లలో 20.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌వో) ఉంటారు. బీఎల్వోలు తమ పరిధిలో ఓటర్ల ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. గత నెలాఖరు వరకు ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి ఓటరుకు రెండు ఫారాలు అందజేస్తారు. ఫారాలు ఎలా నింపాలి?...అనేది వివరిస్తారు. ఆ ఫారాలు నింపి వచ్చే నెల 14వ తేదీలోగా బీఎల్‌వోలకు అందజేయాలి. అవి పూరించి బీఎల్‌వోకు ఇచ్చినప్పుడు రెండోది రశీదుగా ఓటరుకు తిరిగి ఇస్తారు. బీఎల్‌వో వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే ఇంటి గేటులో ఉంచడం లేదా పక్కనున్న ఇంట్లో ఇవ్వడం చేస్తారు. తాళం వేసిన ఇంటికి బీఎల్‌వో మూడుసార్లు వెళతారు. అలాగే ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదుచేసి అప్‌లోడ్ చేసిన తరువాత దాని కాపీలు అందజేసే సదుపాయం కూడా ఉంది. ఓటర్ల నుంచి సేకరించిన ఫారాలను అసెంబ్లీ ఎలకో్ట్రరల్ అధికారికి అందజేస్తే దాని ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా రూపొందిస్తారు. ఏదేమైనా ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు తప్పనిసరిగా అందజేయాలి. లేకపోతే జూలై 21న ప్రచురితం కానున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండదు. కాగా జూలై 14వ తేదీ నుంచి పోలింగ్ బూత్‌లు హేతుబద్ధీకరణ నిర్వహిస్తారు. గరిష్ఠంగా ఒక బూత్‌లో 1,200 మంది ఓటర్లకు మించి ఉండరాదు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత 2002 ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోక పోయినా, వ్యత్యాసం ఉన్నా ఓటర్లకు సంబంధిత ఈఆర్వో నోటీస్ ఇస్తారు. దీనికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు సమర్పించుకునే అవకాశం ఉంది. ఇంకా జూలై 14వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారం అందించకపోతే ఫారం-6 ద్వారా పేరు నమోదుకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు సమయం ఉంది. జూలై 21 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
’సర్’కు విస్తృత ఏర్పాట్లు: కలెక్టర్
జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు అన్ని ఏర్పాట్లుచేశామని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఎల్‌వోలకు శిక్షణ పూర్తిచేశామని, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, బీఎల్‌ఏలను నియమించాలని సూచించామన్నారు. సర్‌కు సహకరించాలని కోరామన్నారు. అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అన్ని సూచనలు చేశామన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాలో తమ పేరు ఉండేలా ప్రతి ఓటరు చూసుకోవాలన్నారు. సర్‌పై సందేహాలుంటే 1950కు కాల్ చేయాలన్నారు. ఇంకా ఈఆర్వో కార్యాలయం/కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌ను సంప్రతించాలన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఓటర్ల జాబితా స్వచ్ఛత, సమగ్రత కోసం ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిందన్నారు. 2004 వరకు సర్ సాధారణ ప్రక్రియగా నిర్వహించారని, వేగవంతమైన పట్టణీకరణ, విద్యా, ఉపాధి అవకాశాల కోసం తరచుగా వలసలు, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్లు, ఓటర్ల జాబితా నాణ్యతపై రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తుండడంతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అనర్హులు జాబితాలో ఉండకూడదనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు.